Repo Rate : లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్..రెపో రేటు 0.25% తగ్గించే అవకాశం..తగ్గనున్న ఈఎంఐలు ?
రెపో రేటు 0.25% తగ్గించే అవకాశం..తగ్గనున్న ఈఎంఐలు ?
Repo Rate : మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ద్రవ్యోల్బణం ఒత్తిడి తగ్గడం వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) త్వరలో తన కీలకమైన రెపో రేటును తగ్గించే అవకాశం ఉంది. రెపో రేటు తగ్గితే, దాని ప్రభావం నేరుగా సామాన్య ప్రజలపై పడుతుంది—లోన్ ఈఎంఐలు (EMI) తగ్గుతాయి మరియు తక్కువ వడ్డీ రేట్లకు కొత్త రుణాలు పొందే అవకాశం పెరుగుతుంది. వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గత రెండు నెలలుగా ప్రభుత్వం నిర్దేశించిన 2 శాతం లక్ష్యానికి దిగువనే ఉంది. ఈ నేపథ్యంలో, ఆర్‌బీఐ డిసెంబర్ 3 నుంచి 5 వరకు జరిగే ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో రెపో రేటును 0.25 శాతం తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రెపో రేటు తగ్గింపుకు దారి తీస్తున్న ప్రధాన కారణం ద్రవ్యోల్బణం తగ్గుదల. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గత రెండు నెలలుగా ప్రభుత్వం నిర్దేశించిన కనిష్ట లక్ష్యమైన 2 శాతం కంటే తక్కువగా ఉంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం వల్ల ఆర్‌బీఐ కీలక వడ్డీ రేటును తగ్గించడానికి అవకాశం లభించింది. ఒకవేళ రెపో రేటు తగ్గితే, కేంద్ర బ్యాంక్ నుంచి కమర్షియల్ బ్యాంకులు తీసుకునే రుణాలపై వడ్డీ తగ్గుతుంది. ఆ ప్రయోజనాన్ని బ్యాంకులు వినియోగదారులకు బదిలీ చేస్తే, మీ లోన్ ఈఎంఐలు తగ్గుతాయి. పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, కార్ లోన్స్ వంటివి మరింత తక్కువ వడ్డీకి లభించే అవకాశం పెరుగుతుంది.
ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన కీలక ద్రవ్య విధాన కమిటీ సమావేశం జరగనుంది. ద్రవ్య విధాన కమిటీ సమావేశం డిసెంబర్ 3 నుంచి 5, 2025 వరకు జరగనుంది. ఆర్‌బీఐ గవర్నర్ డిసెంబర్ 5 న తీసుకున్న నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించిన ఆర్‌బీఐ, మొత్తం 1 శాతం తగ్గింపుతో రెపో రేటును 5.5 శాతానికి చేర్చింది. ఆగస్టులో ఈ తగ్గింపును నిలిపివేశారు.
ఆర్‌బీఐ నిర్ణయంపై ఆర్థిక నిపుణుల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది ఆర్థిక వృద్ధి అంచనా కంటే ఎక్కువ, ద్రవ్యోల్బణం అంచనా కంటే తక్కువగా ఉన్నందున 0.25 శాతం తగ్గింపు ఉండవచ్చు. ఎస్‌బీఐ ఆర్థిక పరిశోధనా విభాగం కూడా బలమైన జీడీపీ వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీ రేట్ల దిశను ఆర్‌బీఐ స్పష్టంగా చెప్పాలని సూచించింది.