RBI Loan Rules: లోన్ తీసుకునేవారికి రిజర్వ్ బ్యాంక్ బిగ్ రిలీఫ్.. ఇకపై ఆ ఛార్జీలు చెల్లించక్కర్లేదు
ఇకపై ఆ ఛార్జీలు చెల్లించక్కర్లేదు
RBI Loan Rules: బ్యాంకుల్లో రుణాలు తీసుకునే సామాన్యులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ తీపి కబురు అందించింది. ఇకపై గుట్టుచప్పుడు కాకుండా వసూలు చేసే హిడెన్ ఛార్జీలు, బ్యాంకుల ఇష్టారాజ్యంగా విధించే అధిక వడ్డీ రేట్లకు అడ్డుకట్ట వేస్తూ ఆర్‌బీఐ సరికొత్త కఠిన నిబంధనలను ప్రతిపాదించింది. వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న ప్రతిఒక్కరికీ వడ్డీ లెక్కలు ఎప్పుడూ అర్థంకాని పజిల్ లాగానే ఉంటాయి. హిడెన్ ఛార్జీల పేరుతో కస్టమర్ల జేబులకు చిల్లు పొడిచే విధానానికి శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ఆర్‌బీఐ నిర్ణయించింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలన్నీ ఒకే విధమైన పారదర్శక విధానాన్ని పాటించేలా కొత్త డ్రాఫ్ట్ ప్రతిపాదనలను తీసుకొచ్చింది. రుణాల ధరలను నిర్ణయించడంలో పూర్తి స్పష్టత తీసుకురావడంతో పాటు ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించగానే ఆ ప్రయోజనం వెంటనే వినియోగదారులకు అందేలా చూసేందుకు ఈ మార్పులు దోహదపడనున్నాయి.
ఇకపై తక్షణమే ఈఎమ్‌ఐ ఉపశమనం
ఈ కొత్త నిబంధనల ప్రకారం వాణిజ్య బ్యాంకులు ఇచ్చే ఫ్లోటింగ్ రేట్ పర్సనల్ రుణాలు, ఎంఎస్‌ఎంఈ రుణాలన్నింటినీ తప్పనిసరిగా ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్‌తో అనుసంధానించాలి. అంటే ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించిన మరుక్షణమే బ్యాంకులు కూడా తమ లోన్ ఇఆర్‌ఎంలను తగ్గించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు బ్యాంకులు తమ లాభాల మార్జిన్ లేదా స్ప్రెడ్‌ను నచ్చినట్లు పెంచుకునే వెసులుబాటు ఉండేది. ఇకపై సరైన కారణం లేకుండా మూడేళ్ల వరకు ఈ స్ప్రెడ్‌లో మార్పులు చేయడానికి వీల్లేదు. ప్రతి బ్యాంక్ తమ వడ్డీ రీసెట్ తేదీలు, కాలపరిమితి వివరాలను కస్టమర్లకు స్పష్టంగా వివరించాల్సి ఉంటుంది.
పరిమితికి మించి వసూలు కుదరదు
ఎక్కువ వడ్డీలు లాగే మైక్రోఫైనాన్స్, రూ.50,000 లోపు ఉండే చిన్న మొత్తం రుణాలపై ఆర్‌బీఐ ప్రత్యేక నిబంధనలను పొందుపరిచింది. వార్షిక వడ్డీ రేటు పై స్పష్టమైన పరిమితి విధించడం వల్ల ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర రుసుముల పేరుతో కస్టమర్ల నుంచి భారీగా డబ్బులు లాగడం కుదరదు. అలాగే చిన్న, సన్నకారు రైతులు తీసుకునే స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై మొత్తం వడ్డీ, ఇతర రుసుములు కలిపి అసలు కంటే ఎక్కువ కాకుండా నియంత్రించనున్నారు. రూ.1,000 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లు ఉన్న లెండర్లు ప్రతి నెలా తమ ఇంటర్నల్ బెంచ్‌మార్క్‌ను ప్రచురించాల్సి ఉంటుంది.
2027 నాటికి పూర్తిస్థాయి అమలు
ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రజల అభిప్రాయాల కోసం అందుబాటులో ఉంచారు. సెప్టెంబర్ 11, 2026 వరకు దీనిపై సలహాలు స్వీకరించనున్నారు. అన్నీ అనుకూలిస్తే ఏప్రిల్ 1, 2027 నాటికి ఈ నూతన నియమావళి అమలులోకి వస్తుంది. అయితే నాన్ ಬ್ಯಾంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు (NBFC) ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ అనుసంధానంపై కొంత మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న పాత రుణాలను ఏప్రిల్ 1, 2029 నాటికి ఒకేసారి నూతన ఫ్రేమ్‌వర్క్‌లోకి మార్చేందుకు అవకాశం కల్పించారు.