RBI: విదేశీ పెట్టుబడులపై ఆర్బీఐ సంచలన నిర్ణయం.. ఇక ప్రతీ పైసాకు లెక్క చెప్పాల్సిందే
ప్రతీ పైసాకు లెక్క చెప్పాల్సిందే
RBI: భారతీయ కంపెనీలు విదేశాలలో భారీగా జరిపే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ODI) లావాదేవీలపై భారత రిజర్వ్ బ్యాంక్ తన నిఘాను విపరీతంగా పెంచింది. ఒకవైపు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPI) భారత స్టాక్ మార్కెట్ నుంచి నిధులను విత్ డ్రా చేసుకోవడం, మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోకుండా కాపాడుకోవడం ఆర్బీఐ ముందున్న ప్రధాన సవాళ్లుగా మారాయి. ఈ నేపథ్యంలో దేశం నుంచి విదేశాలకు తరలిపోయే భారీ నిధుల ప్రవాహాన్ని నియంత్రించేందుకు సెంట్రల్ బ్యాంక్ ఈ కీలక చర్యలు చేపట్టింది. ఐదేళ్ల క్రితం కేవలం 11 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత కంపెనీల విదేశీ పెట్టుబడులు ఆర్థిక సంవత్సరం 2026 నాటికి ఏకంగా 30 బిలియన్ డాలర్లు దాటడం గమనార్హం.
ఆర్బీఐ జారీ చేసిన నిబంధనల చెక్‌లిస్ట్
ఈ సరికొత్త కంట్రోల్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం ఆర్బీఐ దేశంలోని ప్రధాన బ్యాంకులకు కఠినమైన నిబంధనల చెక్లిస్ట్ను అందించింది. విదేశాల్లో 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,300 కోట్లు) దాటే ప్రతి పెట్టుబడికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని బ్యాంకులు క్షుణ్ణంగా సేకరించి ఆర్బీఐకి సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక కంపెనీ తన నికర విలువ కంటే నాలుగు రెట్లకు పైగా మొత్తాన్ని విదేశాల్లో పెట్టుబడి పెట్టాలని భావిస్తే, ఆ డీల్ కూడా ఈ కఠిన తనిఖీల పరిధిలోకి వస్తుంది. విదేశీ కంపెనీల విలువను లెక్కించే కేవలం వేల్యూయేషన్ నివేదికలను చూసి బ్యాంకులు గుడ్డిగా ఆమోదం తెలపడానికి వీల్లేదని, ప్రీమియం చెల్లింపుల వెనుక ఉన్న నిజా నిజాలను సమగ్రంగా పరిశీలించాలని ఆర్బీఐ ఆదేశించింది.
కంపెనీలు సమాధానం చెప్పాల్సిన కీలక ప్రశ్నలు
ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త విధానంలో విదేశాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీల బాధ్యత గణనీయంగా పెరిగింది. భారతీయ కంపెనీలను కాదని విదేశీ కంపెనీలను ఎందుకు ఎంచుకున్నారో వ్యాపార సంస్థలు స్పష్టమైన వివరణ ఇవ్వాలి. అలాగే ఆ విదేశీ సంస్థ నిజమైన ఆపరేటింగ్ కంపెనీయా లేదా కేవలం పెట్టుబడులను దాచే హోల్డింగ్ కంపెనీయా అనేది తేల్చాల్సి ఉంటుంది. ఈ డీల్ ద్వారా భవిష్యత్తులో ఎంత లాభం రావచ్చు, ఎంత కాలం ఆ పెట్టుబడిని కొనసాగిస్తారు, అలాగే ఆ పెట్టుబడి నుంచి బయటకు వచ్చే ఎగ్జిట్ ప్లాన్ ఏంటి అనే విషయాలను బ్యాంకర్లకు పక్కాగా వివరించాలి. ఫైనాన్షియల్ ప్రెజర్ ఎదురైతే తట్టుకునే సామర్థ్యం సదరు భారతీయ కంపెనీకి ఉందో లేదో అని స్ట్రెస్ టెస్టింగ్ ద్వారా బ్యాంకులు నిర్ధారించుకుంటాయి.
భారత ఆర్థిక వ్యవస్థకు చేకూరే ప్రయోజనాలు
ఈ కఠిన నిఘా ఉద్దేశం విదేశీ పెట్టుబడులపై నిషేధం విధించడం కాదని, కేవలం భారత కంపెనీలు నష్టదాయకమైన ఒప్పందాలు చేసుకుని దేశ ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలిగించకుండా చూడడమేనని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ డీల్స్ ద్వారా భారత్ నుంచి ఎగుమతులు ఎంత పెరుగుతాయి, దిగుమతులపై ఆధారపడటం ఎంత తగ్గుతుంది, కొత్త సాంకేతికత లేదా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ (IP) మన దేశానికి ఎలా వస్తుంది అనే అంశాలపై పక్కా నివేదికలు ఇవ్వాలి. అలాగే డివిడెండ్ లేదా ఫీజుల రూపంలో ఎంత విదేశీ మారకద్రవ్యం తిరిగి భారత్‌కు వస్తుందో కూడా స్పష్టంగా లెక్క చూపాల్సి ఉంటుంది. రూపాయి విలువను రక్షించడంలో ఆర్బీఐ తీసుకున్న ఈ ముందస్తు జాగ్రత్త చర్య ఎంతో కీలకమైనదిగా భావిస్తున్నారు.