Russian Oil : రూట్ మార్చిన ముఖేష్ అంబానీ.. అమెరికా, యూరప్‌లకు టెన్షన్ మొదలైందా?
అమెరికా, యూరప్‌లకు టెన్షన్ మొదలైందా?
Russian Oil : ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం అయిన జామ్‌నగర్‌కు, రష్యా రాజధాని మాస్కోకు మధ్య మళ్లీ దోస్తీ చిగురించింది. ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవడం మళ్లీ మొదలుపెట్టింది. అమెరికా, యూరప్ దేశాల ఆంక్షల భయంతో కొన్నాళ్లపాటు రష్యా చమురుకు దూరంగా ఉన్న రిలయన్స్, ఇప్పుడు సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగింది. అమెరికా బ్లాక్ లిస్ట్‌లో లేని రష్యా కంపెనీల నుంచి ఆయిల్‌ను కొనుగోలు చేస్తూ పాశ్చాత్య దేశాలకు చెక్ పెడుతోంది.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ రష్యా నుంచి భారీగా రాయితీతో కూడిన ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా నిషేధించిన రోస్నెఫ్ట్, లుకోయిల్ వంటి పెద్ద కంపెనీల జోలికి వెళ్లకుండా, ఆంక్షలు లేని చిన్న సరఫరాదారుల నుంచి రిలయన్స్ ఆయిల్‌ను కొంటోంది. ఇప్పటికే రుసెక్స్‌పోర్ట్ వంటి సంస్థల నుంచి అఫ్రామాక్స్ ట్యాంకర్ల ద్వారా చమురును గుజరాత్‌లోని జామ్‌నగర్ ప్లాంట్‌కు తరలిస్తోంది. రోజుకు 6,60,000 బ్యారెళ్ల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ ద్వారా దేశీయ అవసరాలను తీర్చడమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉంది.
అమెరికా హెచ్చరికలను లెక్కచేయకుండా.. గతంలో రష్యా చమురుపై అమెరికా 25 శాతం అదనపు టారిఫ్ విధించడంతో పాటు, రష్యాకు సంబంధించిన ప్రధాన ఆయిల్ కంపెనీలపై ఆంక్షలు పెట్టింది. దీంతో రిలయన్స్ కొంతకాలం పాటు రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేసి, మిడిల్ ఈస్ట్ దేశాల వైపు మొగ్గు చూపింది. కానీ ఇప్పుడు పద్ధతి మార్చి, అమెరికా వేసిన చట్టపరమైన లూప్‌హోల్స్‌ను వాడుకుంటూ మళ్లీ రష్యా ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల భారత్‌కు తక్కువ ధరకు ఆయిల్ లభిస్తుంది. అయితే, ఈ చర్యతో అమెరికా, యూరప్ దేశాలు ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రష్యా ఆదాయ వనరులను దెబ్బతీయాలని చూస్తున్న అగ్రరాజ్యానికి, రిలయన్స్ తీసుకున్న ఈ నిర్ణయం మింగుడుపడటం లేదు.
భారత ప్రభుత్వ అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. ఈ నెలలో రష్యా నుంచి చమురు దిగుమతులు సగానికి పైగా తగ్గిపోయాయి. కానీ రిలయన్స్ మళ్లీ మార్కెట్లోకి రావడంతో ఈ లోటు భర్తీ అయ్యేలా కనిపిస్తోంది. అక్టోబర్ 22న అమెరికా కొత్త ఆంక్షలు విధించినప్పుడు రిలయన్స్ జాగ్రత్త పడింది. కానీ ఇప్పుడు ఆంక్షలు లేని మార్గాలను వెతుక్కుని రంగంలోకి దిగింది. ఇది కేవలం వ్యాపార నిర్ణయమే కాకుండా, అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ తన స్వయం ప్రతిపత్తిని చాటుకోవడంగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అంబానీ తీసుకున్న ఈ మాస్టర్ స్ట్రోక్‌తో అగ్రరాజ్యాలు తమ వ్యూహాలను మార్చుకుంటాయో లేదో చూడాలి.