Bank Strike: సామాన్యులకు భారీ ఊరట.. మూడు రోజుల బ్యాంకుల సమ్మె వాయిదా
సమ్మె వాయిదా
Bank Strike: బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన మూడు రోజుల దేశవ్యాప్త సమ్మె చివరి నిమిషంలో రద్దు అయింది. సోమవారం అంటే నేటి నుంచి సెప్టెంబర్ 30 వరకు జరగాల్సిన ఈ సమ్మె వాయిదా పడటంతో వినియోగదారులకు భారీ ఊరట లభించింది. ఐదు రోజుల పని దినాలతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం ఈ సమ్మెకు పిలుపునిచ్చారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) అలాగే యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) మధ్య జరిగిన కీలక చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఐబీఏ, యూఎఫ్‌బీయు కీలక సమావేశం
ఆదివారం రాత్రి 9:30 గంటలకు ఐబీఏ అలాగే యూఎఫ్‌బీయు ప్రతినిధుల మధ్య అత్యవసర సమావేశం జరిగింది. ఈ భేటీలో జరిగిన చర్చల అనంతరం సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం సెలవుల అంశంపై చర్చించడానికి ఒక ప్రత్యేక హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బ్యాంక్ కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని ఈ కమిటీ కనుగొంటుందని తెలిపారు.
ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఏమిటి?
బ్యాంక్ ఉద్యోగులు ప్రధానంగా వారంలో ఐదు రోజులు మాత్రమే పని దినాలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే శనివారం, ఆదివారం రెండు రోజులు సెలవులు ప్రకటించాలని కోరుతున్నారు. అలాగే పెన్షన్ ప్రయోజనాలు మెరుగుపరచడం, పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమల్లోకి తేవడం, పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలను త్వరగా పూర్తి చేయడం వంటి డిమాండ్లు ఉన్నాయి. పీఎల్‌ఐ పథకంలో మార్పుల గురించి కూడా ప్రభుత్వంతో చర్చలు జరపాలని యూనియన్లు కోరాయి.
గతంలో జరిగిన సమ్మెలు అలాగే నేటి పరిస్థితి
ఈ సమ్మెకు ముందు సెప్టెంబర్ 11న కూడా ఒక రోజు సమ్మె జరిగింది. మళ్లీ సోమవారం నుంచి మూడు రోజులు సమ్మె ఉంటే ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉండేది. సెప్టెంబర్ 30వ తేదీ బ్యాంకులకు అర్ధ సంవత్సరం ముగింపు కావడంతో లావాదేవీలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. యూనియన్లు సమ్మెను విరమించుకోవడంతో అన్ని బ్యాంక్ బ్రాంచ్‌లు, ఏటీఎంలు ఎలాంటి అంతరాయం లేకుండా సేవలు అందించనున్నాయి.