Fastag: ఫ్రీగా రూ.1,000 ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్.. నేషనల్ హైవేలపై ప్రయాణించేవారికి బంపర్ ఆఫర్!
బంపర్ ఆఫర్!
Fastag: నేషనల్ హైవేలపై తరచూ ప్రయాణించే వాహనదారులకు జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) ఒక అద్భుతమైన అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. టోల్ ప్లాజాల వద్ద టాయిలెట్ల శుభ్రతపై ఫొటో తీసి ఫిర్యాదు చేస్తే చాలు.. మీ ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాలో ఏకంగా రూ.1,000 ఉచిత రీఛార్జ్ రూపంలో పొందవచ్చు. జాతీయ రహదారులపై ప్రయాణించే పౌరులకు మెరుగైన వసతులు అందించాలనే లక్ష్యంతో ఎన్‌హెచ్‌ఏఐ క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. సాధారణంగా హైవేలపై ప్రయాణించేటప్పుడు శుభ్రంగా లేని టాయిలెట్ల వల్ల పౌరులు తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా, టోల్ ప్లాజాల వద్ద నిర్వహణ సరిగ్గా లేని లేదా అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లను ఫొటో తీసి పంపినవారికి ప్రోత్సాహకంగా రూ.1,000 ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ బహుమతిగా అందిస్తున్నారు.
2027 జూన్ వరకు పథకం పొడిగింపు
వాహనదారుల నుంచి విశేష స్పందన లభించడంతో ఈ పథకం గడువును 2027 జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మొదట్లో పరిమిత కాలానికి ప్రారంభించినప్పటికీ, ప్రజ భాగస్వామ్యంతో టోల్ ప్లాజాల వద్ద పరిశుభ్రత పెరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఈ పథకాన్ని మరింత కాలం అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రయాణికులు తమ ప్రయాణంలో నాణ్యమైన సేవలు పొందడమే కాకుండా, ఉచిత రీఛార్జ్ పొందే అవకాశాన్ని కూడా పొందుతున్నారు.
రూ.1,000 ఉచిత రీఛార్జ్ ఎలా పొందాలి?
ఈ పథకం కింద బహుమతి పొందడం చాలా సులభం. దీని కోసం వాహనదారులు ముందుగా ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి రాజ్‌మార్గ్ యాత్ర మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. టోల్ ప్లాజా వద్ద ఉన్న టాయిలెట్ అపరిశుభ్రంగా ఉంటే, ఫోన్ లోకేషన్ (GPS) ఆన్ చేసి ఆ అపరిశుభ్ర వాతావరణాన్ని స్పష్టంగా ఫొటోలు తీయాలి. రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌లోని ఫిర్యాదుల విభాగంలో ఆ జియో-ట్యాగ్డ్ ఫొటోలను అప్‌లోడ్ చేసి, మీ పేరు, వాహన రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్ వివరాలు సమర్పించాలి.
గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన నిబంధనలు
ఈ పథకానికి సంబంధించి కొన్ని కీలక నియమాలు ఉన్నాయి. ఇది కేవలం ఎన్‌హెచ్‌ఏఐ పరిధిలోని టోల్ ప్లాజాల వద్ద ఉన్న టాయిలెట్లకు మాత్రమే వర్తిస్తుంది. ప్రైవేట్ పెట్రోల్ బంకులు, దాబాల వద్ద ఉండే టాయిలెట్లకు ఈ ఆఫర్ వర్తించదు. ఒక వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌కు ఒకసారి మాత్రమే ఈ రీఛార్జ్ సదుపాయం లభిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ప్రత్యక్ష పరిశీలన ద్వారా మీరు పంపిన ఫొటోలను అధికారులు తనిఖీ చేసి, నిజమైన ఫిర్యాదుగా నిర్ధారించిన తర్వాత 5 రోజుల వ్యవధిలో రూ.1,000 ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ మీ ఖాతాలోకి జమ చేస్తారు. ఈ నగదును నేరుగా పొందడం సాధ్యపడదు, కేవలం ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ రూపంలో మాత్రమే పొందే అవకాశం ఉంటుంది.