Rupee Crash: భారత కరెన్సీకి బిగ్ షాక్.. డాలర్‌తో పోలిస్తే 99కి పడిపోనున్న విలువ
పడిపోనున్న విలువ
Rupee Crash: భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలు మన దేశీయ కరెన్సీకి తీవ్ర సవాళ్లను విసురుతున్నాయి. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ నిరంతరం బలహీనపడుతోంది. ప్రముఖ ఆర్థిక సంస్థ కోటక్ సెక్యూరిటీస్ అంచనా ప్రకారం రూపాయి రాబోయే రోజుల్లో మరింత పతనమయ్యే ప్రమాదం ఉంది. కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అనింద్య బెనర్జీ వెల్లడించిన వివరాల ప్రకారం, రూపాయి త్వరలోనే డాలర్‌తో పోలిస్తే 97 స్థాయికి చేరుకోవచ్చు. ఒకసారి ఆ మద్దతు స్థాయిని కోల్పోతే పతనం వేగంగా సాగి 98.5 నుంచి 99 స్థాయికి పడిపోవచ్చని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 96.442 వద్ద కొనసాగుతోంది.
విదేశీ ఇన్వెస్టర్ల నిరంతర విక్రయాల ఒత్తిడి
రూపాయి పతనానికి ప్రధాన కారణం విదేశీ సంస్థాగత మదుపర్లు (FPI) నిరంతరం షేర్లను విక్రయించడమే. ఈ ఒక్క నెలలోనే విదేశీ మదుపర్లు సుమారు 6.1 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ షేర్లను అమ్మేశారు. గడచిన కొన్ని నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన మొత్తం నిధులలో సుమారు 90 శాతం వరకు వెనక్కి తీసేశారు. ఇటీవల ఎఫ్‌సీఎన్‌ఆర్ (B) ద్వారా దేశానికి కొంత విదేశీ మారకద్రవ్య నిధులు వచ్చినా, దాని వల్ల నేరుగా రూపాయికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. ఆ నిధులు మార్కెట్లోకి రాకుండా నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారెక్స్ రిజర్వ్‌లకు చేరాయి. దీనివల్ల కరెన్సీ మార్కెట్‌లో డాలర్ కొరత ఏర్పడి రూపాయిపై తీవ్ర ఒత్తిడి కొనసాగుతోంది.
పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు
రూపాయి ఆరోగ్యం దెబ్బతినడానికి ముడి చమురు ధరల పెరుగుదల కూడా మరో ముఖ్య కారణం. దీన్ని కేవలం బ్రెంట్ క్రూడ్ ధరల ద్వారా మాత్రమే అంచనా వేయలేము. స్పాట్ క్రూడ్, రవాణా ఛార్జీలు, రిఫైన్డ్ ఉత్పత్తుల ధరలు కూడా కీలకంగా మారాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా రిఫైనరీ రంగంలో వివిధ సమస్యలు తలెత్తుతున్నాయి. దీనివల్ల డీజిల్ నుంచి ఏవియేషన్ ఫ్యూయల్ వరకు అన్ని రకాల ఇంధనాల ధరలు గరిష్ట స్థాయిలోనే ఉన్నాయి. భారత్ తన అవసరాల కోసం ఇంధనాన్ని భారీగా దిగుమతి చేసుకుంటున్నందున, బిల్లులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి, వ్యాపార నిర్వహణ వ్యయం అధికమై రూపాయి మరింత బలహీనపడుతోంది.
వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు
రూపాయి క్షీణత ఇలాగే కొనసాగితే భారతీయ రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి దిగి మార్కెట్‌ను చక్కదిద్దే అవకాశం ఉంది. పరిస్థితి మరింత దిగజారితే కేంద్ర బ్యాంకు కరెన్సీ మార్కెట్‌లో తన జోక్యాన్ని పెంచవచ్చు. అంతేకాకుండా రాబోయే నెలల్లో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. డిసెంబర్ నెలలో కూడా వడ్డీ రేట్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఆర్‌బీఐ కేవలం అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోదు. దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని అణచివేయడమే ఆర్‌బీఐ ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. పాజిటివ్ రియల్ ఇంట్రెస్ట్ రేట్లను కాపాడుకుంటూ ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడంపై కేంద్ర బ్యాంకు దృష్టి పెట్టింది.
అమెరికా బాండ్ ఈల్డ్ ప్రభావం
భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచంలోని మిగతా దేశాల మార్కెట్లకు కూడా అమెరికా నుంచి ఆందోళనకర వార్తలు వస్తున్నాయి. అమెరికాలో దీర్ఘకాలిక బాండ్ల ఈల్డ్ గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండే బాండ్లపై తీవ్రమైన ఒత్తిడి కనిపిస్తోంది. పెద్ద అమెరికన్ టెక్ కంపెనీలు భారీగా రుణాలు తీసుకుంటుండటంతో మార్కెట్లో నిధుల డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా దీర్ఘకాలిక ఈల్డ్స్ అధికంగా ఉండే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గే వరకు గ్లోబల్ ఈల్డ్స్ పై ఈ ఒత్తిడి కొనసాగుతుంది. ఈ గ్లోబల్ అనిశ్చితి ప్రభావం నేరుగా భారత రూపాయిపై పడుతోంది.