Stock Market: వారం తొలి రోజున భారతీయ స్టాక్ మార్కెట్ శుభారంభంతో లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, ఆ సంతోషం కొద్దిసేపటికే ఆవిరైపోయింది. గడిచిన 8 వారాలుగా వరుస నష్టాల్లో కూరుకుపోయిన దలాల్ స్ట్రీట్‌కు ఈ రోజైనా ఊరట లభిస్తుందని ఆశించిన పెట్టుబడిదారులకు తీవ్ర నిరాశే ఎదురైంది. ప్రారంభంలో సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల బాటలో దూసుకెళ్లినప్పటికీ, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన సంచలన వ్యాఖ్యలతో మార్కెట్ క్షణాల్లో తీవ్ర ఒత్తిడికి లోనై భారీగా పడిపోయింది.

లాభాల నుంచి తీవ్ర నష్టాల్లోకి..

ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 722 పాయింట్లు పెరిగి 72,631 పాయింట్ల గరిష్ట స్థాయిని, నిఫ్టీ 199 పాయింట్లు లాభపడి 22,621 పాయింట్ల స్థాయిని తాకాయి. ఈ పెరుగుదలతో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకునే లోపే మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి విపరీతంగా పెరిగింది. సెన్సెక్స్ తన ఆల్‌టైమ్ డే-హై నుంచి ఏకంగా 791 పాయింట్లు పడిపోయి 71,840 స్థాయికి పడిపోగా, నిఫ్టీ తన గరిష్ట స్థాయి నుంచి 224 పాయింట్లు క్షీణించి 22,397 పాయింట్ల వద్దకు చేరుకుంది.

వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి

దిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పంద చర్చలు ప్రస్తుతం దాదాపు నిలిచిపోయాయని వెల్లడించారు. సుదీర్ఘమైన చర్చల తర్వాత రెండు దేశాల మధ్య ఒక రకమైన ప్రతిష్టంభన ఏర్పడిందని, ఇరువైపులా ఇచ్చిపుచ్చుకునేందుకు ఏమీ లేని పరిస్థితి వచ్చిందని స్పష్టం చేశారు. అమెరికా వైపు తీవ్రమైన ట్రేడ్ లోటు ఉండటంతో, భారత్ తమ నుంచి ఎక్కువ వస్తువులను దిగుమతి చేసుకోవాలని అమెరికా తీవ్ర ఒత్తిడి తెస్తోంది.

బార్గేనింగ్ అస్త్రంగా మారిన టారిఫ్‌లు

ప్రపంచ వాణిజ్య ధోరణులు మారాయని, ఇప్పుడు టారిఫ్‌లను కేవలం పన్నుల రూపంలోనే కాకుండా చర్చల సాధనాలుగా, ఒత్తిడి తెచ్చే అస్త్రాలుగా ఉపయోగిస్తున్నారని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. భారత్, చైనాల మధ్య ఉన్న వాణిజ్య లోటును ఉదాహరణగా చూపిస్తూ, కేవలం ట్రేడ్ డెఫిసిట్ ప్రాతిపదికగానే పెద్ద ఒప్పందాలు ముడిపడి ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమిసన్ గ్రీర్ మాట్లాడుతూ, ట్రంప్ ప్రభుత్వం భారత్‌తో ఒప్పందంపై పని చేస్తోందని, కానీ ఇది వెంటనే ముగిసేలా కనిపించడం లేదని పేర్కొనడం మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది.

ఊగిసలాటలోనే దలాల్ స్ట్రీట్

రెండు దేశాల మధ్య నెలకొన్న ఈ వాణిజ్య అనిశ్చితి ముగిసే వరకు స్టాక్ మార్కెట్‌లో ఈ రకమైన హెచ్చుతగ్గులు కొనసాగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా మారిన టారిఫ్ పరిణామాలు, భారత్-అమెరికా సంబంధాల తీవ్రత ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తిస్తోంది. రాబోయే రోజుల్లో ఇరు దేశాల ప్రతినిధుల నుంచి వచ్చే సంకేతాలే మార్కెట్ తదుపరి దిశను నిర్ణయించనున్నాయి.

Tags: