Smartphone Sales: దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పండగ సీజన్ ప్రారంభమైనప్పటికీ మొబైల్ ఫోన్ మార్కెట్‌లో మాత్రం తీవ్ర నిరాశ అలుముకుంది. సాధారణంగా దసరా, దీపావళి సమయంలో ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు నిర్వహించే ఆన్‌లైన్ సేల్స్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు జరుగుతుంటాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ రిపోర్ట్ ప్రకారం, ఈ-కామర్స్ సేల్స్‌లో స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు ఏకంగా 16 శాతం మేర పడిపోయాయి. గత కొన్ని సంవత్సరాలలో మొబైల్ మార్కెట్ ఇంతటి భారీ క్షీణతను చవిచూడటం ఇదే మొదటిసారని నిపుణులు పేర్కొంటున్నారు.

ధరల పెరుగుదల, తగ్గిన డిస్కౌంట్లు

స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు పడిపోవడానికి ప్రధాన కారణం వాటి ధరలు విపరీతంగా పెరిగిపోవడమే. మొబైల్ తయారీలో కీలకమైన మెమరీ చిప్‌ల ధరలు రెండు నుంచి మూడు రెట్లు పెరిగాయి. దీనికి తోడు రూపాయి మారకం విలువ పతనం కావడం, రవాణా ఖర్చులు పెరగడం వంటి కారణాల వల్ల స్మార్ట్‌ఫోన్ల ధరలు సుమారు 35 నుంచి 40 శాతం వరకు పెరిగాగా మారాయి. గతంలో పండగ సేల్స్‌లో కస్టమర్లకు 25 నుంచి 40 శాతం వరకు భారీ డిస్కౌంట్లు లభించేవి. కానీ తయారీ ఖర్చులు విపరీతంగా పెరగడంతో ఈసారి ఆ డిస్కౌంట్లు కేవలం 10 నుంచి 25 శాతానికి మాత్రమే పరిమితమయ్యాయి.

ఆఫ్‌లైన్ మార్కెట్‌లోనూ దయనీయ పరిస్థితి

కేవలం ఆన్‌లైన్ విక్రయాలు మాత్రమే కాకుండా సాధారణ దుకాణాల పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (AIMRA) వెల్లడించిన వివరాల ప్రకారం.. నవరాత్రులు ప్రారంభమైనప్పటి నుంచి దుకాణాల్లో ఫోన్ల అమ్మకాలు 20 శాతం వరకు తగ్గాయి. గత నెలతో పోలిస్తే షాపులకు వచ్చే కస్టమర్ల సంఖ్యలో 40 నుంచి 50 శాతం క్షీణత కనిపించింది. కొత్త ఫోన్లు కొనే ఆర్థిక స్థోమత లేకపోవడంతో చాలామంది వినియోగదారులు పాత ఫోన్లనే రిపేర్ చేయించుకోవడం లేదా సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

ప్రీమియం ఫోన్లకు మాత్రం కొనసాగుతున్న డిమాండ్

మొబైల్ మార్కెట్‌లో మొత్తం మీద విక్రయాలు తగ్గినప్పటికీ, రూ.45,000 కంటే ఎక్కువ ధర కలిగిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్లకు మాత్రం డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఆపిల్, శాంసంగ్, వివో వంటి పెద్ద బ్రాండ్ల ఫోన్ల సగటు ధర రూ.35,000 నుంచి రూ.37,000 మధ్య ఉండటంతో కంపెనీల ఆదాయం పరంగా పెద్దగా నష్టం వాటిల్లలేదు. అయితే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే బడ్జెట్ ఫోన్ల అమ్మకాలు మాత్రం దెబ్బతిన్నాయి. దీపావళి నాటికి మార్కెట్లో కొంత కోలుకునే అవకాశం ఉన్నప్పటికీ, పండగ సీజన్ మొత్తం మీద మాత్రం విక్రయాలు మందగించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా దీపావళి తర్వాత మొబైల్ ఫోన్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Tags: