Sugar Price: బ్లాక్ మార్కెటింగ్‌పై ఉక్కుపాదం.. పంచదార ధరలు తగ్గేలా కేంద్రం సంచలన నిర్ణయం
కేంద్రం సంచలన నిర్ణయం
Sugar Price: పండుగల సీజన్ ప్రారంభమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున పంచదారను ఉపయోగించే ఫుడ్ కంపెనీలకు నిల్వల గడువు పెంపు విషయంలో ఎలాంటి ఉపశమనం ఇచ్చేందుకు నిరాకరించింది. అదనంగా ఉన్న నిల్వలను ఆగస్టు 31 లోగా బహిరంగ మార్కెట్లో అమ్మాల్సిందేనని స్పష్టం చేసింది. దేశంలో చక్కెర ధరలను అదుపులో ఉంచడంతో పాటు అక్రమ నిల్వలను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బిస్కెట్లు, చాక్లెట్లు, బ్రెడ్లు తయారుచేసే కంపెనీలు తమ దగ్గర ఉన్న పరిమితికి మించిన పంచదారను తక్షణమే విక్రయించాలని ఆదేశించింది. గతంలో ఉన్న 30 రోజుల స్టాక్ పరిమితిని ఇటీవల 15 రోజులకు తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో భారీ వ్యాపారులు తమ అవసరాలకు కేవలం 15 రోజులకు సరిపడా నిల్వలను మాత్రమే ఉంచుకునేందుకు వెసులుబాటు ఉంది. సడలింపు ఇవ్వాలన్న కంపెనీల విజ్ఞప్తిని ఆహార కార్యదర్శి తోసిపుచ్చారు.
ధరల పెరుగుదలపై కంపెనీల ఆందోళన
అదనపు నిల్వలను ఇప్పుడు అమ్మేసి, పండుగల సమయంలో మళ్లీ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తే ఒక్కసారిగా డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని తాకుతాయని పలు దిగ్గజ ఫుడ్ కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. విదేశీ ఎగుమతుల ఆర్డర్లు పూర్తి చేయడం కూడా కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాము రీ-సేల్ చేయడం కోసం కాకుండా, కేవలం ఉత్పత్తి అవసరాల కోసమే సీజనల్ స్టాక్ ఉంచుకున్నామని కొన్ని ప్రముఖ కంపెనీల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.
సట్టా బజార్‌కు చెక్, మార్కెట్లోకి 4 లక్షల టన్నుల చక్కెర
పరిమితికి మించిన నిల్వలు మార్కెట్లోకి రావడం వల్ల సాధారణ వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నిబంధన వల్ల దాదాపు 3 నుంచి 4 లక్షల టన్నుల అదనపు చక్కెర బహిరంగ మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల ఊహాజనిత వ్యాపారం (సట్టా బజార్), కృత్రిమ కొరత సృష్టించే వర్గాలకు చెక్ పడుతుందని పార్లే ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. పండుగల వేళ సామాన్యులకు తక్కువ ధరకే చక్కెర అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
తనిఖీలు తీవ్రం, దిగ్గజ కంపెనీల ఇబ్బందులు
ఇండియన్ షుగర్ అండ్ బయో-ఎనర్జీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ISMA) ఫిర్యాదుల ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌తో పాటు పలు రాష్ట్రాల్లో నిల్వదారులపై దాడులు నిర్వహించడంతో వ్యాపారుల్లో కలకలం రేగింది. ఫార్మా, ఎంబీసీ ఫుడ్ కంపెనీలు నిర్దిష్టమైన గ్రేడ్ పంచదారపైనే ఆధారపడటంతో సకాలంలో సరఫరా అందుతుందో లేదోనన్న దిగులు వారిలో మొదలైంది.