Digital Revolution : ప్రపంచంలోనే తొలి 100% క్యాష్‌లెస్ దేశం..హిస్టరీ క్రియేట్ చేసిన స్వీడన్

హిస్టరీ క్రియేట్ చేసిన స్వీడన్

Update: 2025-11-12 07:20 GMT

Digital Revolution : మారుతున్న సాంకేతిక ప్రపంచంలో ఆన్‌లైన్ చెల్లింపులు వేగంగా దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు క్యాష్‌లెస్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నప్పటికీ, భారత్‌తో సహా చాలా చోట్ల ఇప్పటికీ నగదు వినియోగం ఎక్కువగా ఉంది. అయితే, ఈ విషయంలో యూరప్‌కు చెందిన ఒక దేశం చరిత్ర సృష్టించింది. స్వీడన్ 100 శాతం డిజిటల్ పేమెంట్స్ లక్ష్యాన్ని చేరుకొని, ప్రపంచంలోనే మొట్టమొదటి క్యాష్‌లెస్ దేశంగా అవతరించింది. స్వీడన్ ఈ ఘనతను ఎలా సాధించింది, అక్కడి ప్రజలు ఈ సాంకేతిక విప్లవాన్ని ఎలా స్వీకరించారో తెలుసుకుందాం.

యూరప్ ఖండంలోని స్వీడన్ దేశం 100 శాతం క్యాష్‌లెస్ లావాదేవీల లక్ష్యాన్ని చేరుకుని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. స్వీడన్ దాదాపు పూర్తిగా నగదు రహిత దేశంగా మారింది. అక్కడ చాలా దుకాణాలలో క్యాష్ నాట్ యాక్సెప్టెడ్ అనే బోర్డులు కనిపిస్తున్నాయి. క్యాష్‌లెస్ విప్లవంలో దేశంలోని యువతతో పాటు వృద్ధులు కూడా పాలుపంచుకున్నారు. సాధారణంగా వృద్ధులు కొత్త టెక్నాలజీకి దూరంగా ఉంటారనే భావన ఉన్నప్పటికీ, స్వీడన్ దీనిని మార్చేసింది. అక్కడి వృద్ధులు కూడా ఆన్‌లైన్ పేమెంట్ యాప్‌లను ఉపయోగిస్తూ, ఈ సాంకేతిక మార్పుకు అభిమానులుగా మారారు.

స్వీడన్ నగదు రహిత దేశంగా మారడానికి దశాబ్దకాలం క్రితమే ప్రణాళికలు ప్రారంభించింది. ఈ మార్పులో అత్యంత కీలక పాత్ర పోషించింది స్విష్ అనే మొబైల్ పేమెంట్స్ యాప్. దీనిని 2012లో దేశంలోని ప్రధాన బ్యాంకులు కలిసి ప్రారంభించాయి. ప్రస్తుతం స్వీడన్ మొత్తం జనాభాలో 75% మంది, అంటే 80 లక్షల మందికి పైగా, ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. స్విష్ యాప్ రోజువారీ చిన్న లావాదేవీల నుంచి పెద్ద లావాదేవీల వరకు ప్రధాన సాధనంగా మారింది.

గత కొన్ని సంవత్సరాలలో స్వీడన్‌లో నగదు లావాదేవీల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 2010 సంవత్సరంలో స్వీడన్‌లో జరిగిన మొత్తం లావాదేవీలలో సుమారు 40 శాతం లావాదేవీలు నగదు రూపంలో జరిగేవి. ఈ సంఖ్య 2023 నాటికి 1 శాతం కంటే తక్కువకు పడిపోయింది. 2025 నాటికి ఈ నగదు లావాదేవీల శాతం దాదాపు సున్నాకు చేరుకుంది. అంటే, స్వీడన్ ఇప్పుడు పూర్తిగా డిజిటల్ ట్రాన్సాక్షన్ల దేశంగా అవతరించింది. నగదు వినియోగాన్ని పూర్తిగా తగ్గించడం ద్వారా స్వీడన్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది.

Tags:    

Similar News