Tata Electronics: ఎలక్ట్రానిక్స్ రంగంలో దూసుకుపోతున్న టాటా గ్రూప్
టాటా గ్రూప్
Tata Electronics: భారతీయ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ టెక్నాలజీ అలాగే ఎలక్ట్రానిక్స్ రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత చాటుకునేందుకు భారీ ప్రణాళికలతో ముందుకు వెళుతోంది. దేశంలో యాపిల్ ఐఫోన్‌ల తయారీ నుంచి అత్యంత కీలకమైన సెమీకండక్టర్ చిప్స్ ఉత్పత్తి వరకు అన్ని విభాగాల్లోనూ టాటా ఎలక్ట్రానిక్స్ దూసుకుపోతోంది. ఈ వ్యాపారాన్ని మరింత వేగంగా విస్తరించాలనే ఉద్దేశంతో కంపెనీ తన పెట్టుబడులను భారీగా పెంచేసింది. తాజాగా వెలువడిన అధికారిక నివేదికల ప్రకారం, గడిచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన పెట్టుబడులను ఏకంగా మూడు రెట్లు పెంచినట్లు స్పష్టమైంది.
కంపెనీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు అందించిన తాజా వివరాల ప్రకారం.. టాటా ఎలక్ట్రానిక్స్ తన వివిధ సబ్సిడరీ యూనిట్ల అభివృద్ధి కోసం రూ.61,280 కోట్ల భారీ కార్పొరేట్ గ్యారెంటీని అందించింది. అలాగే దైనందిన కార్యకలాపాల నిర్వహణ కోసం రూ.1,017 కోట్ల కొత్త ఇంటర్-కార్పొరేట్ లోన్‌ను కూడా జారీ చేసింది. మార్చి 2026 నాటికి కంపెనీ మొత్తం ఈక్విటీ పెట్టుబడి మూడు రెట్లు పెరిగి ఏకంగా 3,727 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంతకుముందు సంవత్సరంలో ఈ మొత్తం కేవలం రూ.1,200 కోట్ల వరకు మాత్రమే పరిమితమై ఉండటం గమనార్హం.
టాటా ఎలక్ట్రానిక్స్ పెట్టిన ఈ భారీ పెట్టుబడుల్లో సింహభాగం సెమీకండక్టర్ వ్యాపారానికే కేటాయించడం విశేషం. గణాంకాల ప్రకారం.. టాటా సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ విభాగంలో ఏకంగా రూ.1,501 కోట్ల పెట్టుబడి పెట్టారు. గతేడాది ఈ విభాగంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టకపోవడం గమనార్హం. అలాగే టాటా సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫండ్ కేటాయింపులు కూడా గతంలో ఉన్న రూ.50 కోట్ల నుంచి ఏకంగా రూ.954 కోట్లకు భారీగా పెరిగాయి. దీనిద్వారా చిప్ మేకింగ్ రంగంలో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో టాటా బలంగా అడుగులు వేస్తోందని అర్థం అవుతోంది.
గ్లోబల్ మార్కెట్‌లో తమ ఉనికిని బలోపేతం చేసుకునే క్రమంలో కంపెనీ మొత్తం రుణం 71 శాతం పెరిగి రూ.11,718 కోట్లకు చేరుకుంది. అయినప్పటికీ కార్యకలాపాలకు ఎక్కడా నిధుల కొరత రాకుండా మాతృ సంస్థ టాటా సన్స్ సెప్టెంబర్ నుంచి మార్చి మధ్య కాలంలో రెండు విడతలుగా మొత్తం రూ.3,000 కోట్ల తాజా ఈక్విటీని అందించింది. కేవలం ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సంస్థ, నేడు టాటా గ్రూప్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థగా అవతరించింది.
ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న మొత్తం యాపిల్ ఐఫోన్లలో దాదాపు 12 శాతాన్ని ఇప్పుడు ఒక్క టాటా ఎలక్ట్రానిక్సే తయారు చేస్తుండటం దేశానికే గర్వకారణం. ఈ అద్భుతమైన వృద్ధి కంపెనీ రెవెన్యూపై కూడా స్పష్టమైన ప్రభావాన్ని చూపింది. తాజా ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆపరేటింగ్ ఆదాయం ఏకంగా 96 శాతం దూసుకెళ్లి 1,29,902 కోట్ల రూపాయల మార్కును దాటింది. అయితే విస్తరణ ఖర్చులు, డిప్రిసియేషన్ , వడ్డీ భారం కారణంగా కంపెనీ నికర నష్టం కొంత పెరిగినప్పటికీ, భవిష్యత్తుపై భారీ అంచనాలతో ముందుకెళ్తోంది.
కంపెనీ స్టాండ్‌అలోన్ ప్రాతిపదికన చూస్తే.. ఆపరేటింగ్ ఆదాయం మూడు రెట్లు కంటే ఎక్కువగా పెరిగి రూ.4,015 కోట్లకు చేరుకుంది. అలాగే సబ్సిడరీ సంస్థల ఉద్యోగుల కోసం కంపెనీ ప్రత్యేకంగా ఎప్లాయ్ స్టాండ్‌అలోన్ ఆప్షన్ ప్లాన్ ను కూడా ప్రకటించి వారిని ప్రోత్సహించింది. ఆర్థిక పనితీరు, రెవెన్యూ ఆధారంగా ప్రస్తుతం టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ టాటా గ్రూప్‌లో నాల్గవ అతిపెద్ద కంపెనీగా గుర్తింపు పొందింది.