Tata Sons: భారతీయ వ్యాపార రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన టాటా సన్స్ కంపెనీని షేర్ మార్కెట్లో లిస్ట్ చేసే అంశంపై ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. వచ్చే నవంబర్ 26న జరగనున్న కీలకమైన బోర్డు సమావేశానికి సరిగ్గా పది రోజుల ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంపెనీకి ఒక గట్టి లేఖ పంపింది. నవంబర్ 16న టాటా సన్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌కు అందిన ఈ లేఖలో అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీ నిబంధనల ప్రకారం కంపెనీ కచ్చితంగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ పరిణామం టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా అనుసరించాలనుకుంటున్న వ్యూహానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది.

అన్‌లిస్టెడ్ హోదా కాపాడుకునేందుకు రెండు కంపెనీల విలీన ప్లాన్

టాటా సన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ మార్కెట్లోకి రాకుండా అన్‌లిస్టెడ్‌గానే ఉండాలనే గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే నవంబర్ 26 సమావేశంలో ఒక భారీ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. టాటా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ సొల్యూషన్స్ అలాగే టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ అనే రెండు పూర్తి యాజమాన్య హక్కులు కలిగిన కంపెనీలను టాటా సన్స్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదన సిద్ధం చేశారు. ఈ విలీనం ద్వారా కంపెనీ ఆర్థిక స్వరూపాన్ని మార్చి, కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (CIC) నిబంధనల పరిధి నుంచి బయటపడాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ఎత్తుగడలకు ఆర్‌బీఐ నుంచి అధికారికంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(NOC) లభించడం అనివార్యం.

ఎస్‌పీ గ్రూప్ వాటాల కొనుగోలుపై క్లారిటీ వచ్చే అవకాశం

ఈ హై-వోల్టేజ్ బోర్డు మీటింగ్‌లో షాపూర్జీ పల్లోంజీ (SP) గ్రూప్ ఆర్థిక అవసరాలపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. క్యాపిటల్ రిడక్షన్ పద్ధతి ద్వారా ఎస్‌పీ గ్రూప్ వాటాలను కొనుగోలు చేసి రద్దు చేయడం ద్వారా వారికి సుమారు రూ.25,000 కోట్లు అందించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. గతంలో ఆర్‌బీఐ నిబంధనల నుంచి తప్పించుకునేందుకు చేసిన డీ-రిజిస్ట్రేషన్ ప్రయత్నాన్ని కేంద్ర బ్యాంకు తిరస్కరించిన నేపథ్యంలో, ఇప్పుడు ఆర్‌బీఐ పంపిన తాజా లేఖ యాజమాన్యానికి పెద్ద సవాల్‌గా మారింది. నవంబర్ 26న జరిగే ఈ సమావేశంలో బోర్డు మెంబర్లు తీసుకోబోయే నిర్ణయాలు దేశ ఆర్థిక మార్కెట్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Tags: