TaX Free : ఎంత సంపాదించినా పన్ను కట్టక్కర్లేదు.. ట్యాక్స్ లేని దేశాలివే

ట్యాక్స్ లేని దేశాలివే

Update: 2025-11-26 10:56 GMT

TaX Free : ప్రపంచంలో చాలా మంది ఉద్యోగులు పన్ను కోత చూసి నిట్టూరుస్తుంటారు. కానీ ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి.. అక్కడ మీ జీతం నుంచి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పన్నుగా తీసుకోదు. ఈ జాబితాలో ముందుండేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దుబాయ్, అబుదాబి వంటి నగరాలు ఆదాయపు పన్ను లేకపోవడంతోనే అంతర్జాతీయ నిపుణులకు ఆకర్షణీయంగా మారాయి. యూఏఈ మాత్రమే కాదు, దాని పొరుగు దేశాలైన సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఖతార్ వంటి దేశాలలో కూడా ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. కువైట్‌లో అయితే వారసత్వం పైన, బహుమతుల పైన కూడా పన్ను ఉండదు. అయితే ఒమన్ మాత్రం 2028 నుంచి అధిక ఆదాయం ఉన్నవారిపై 5% పన్ను వేయాలని యోచిస్తోంది.

పన్ను లేని దేశాలకు పూర్తి విరుద్ధంగా, కొన్ని యూరోపియన్ దేశాల్లో ప్రజలు తమ ఆదాయంలో సగానికిపైగా పన్నుల రూపంలో చెల్లిస్తారు. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయపు పన్ను వసూలు చేసే దేశంగా ఫిన్లాండ్ ఉంది. అక్కడ పన్ను గరిష్ట రేటు 57.65% వరకు ఉంటుంది. ఆ తర్వాత జపాన్ (55.95%), డెన్మార్క్ (55.9%), ఆస్ట్రియా (55%), స్వీడన్ (52%) వంటి దేశాల్లో కూడా పన్ను భారం చాలా ఎక్కువ. బెల్జియం, ఇజ్రాయెల్, పోర్చుగల్ వంటి దేశాల్లో కూడా ప్రజలు తమ సంపాదనలో 48% నుంచి 50% వరకు పన్ను కడుతున్నారు. లండన్ లో ఆదాయాన్ని బట్టి పన్ను 20% నుంచి 45% వరకు ఉంటుంది. దీనికి అదనంగా అన్ని వస్తువులపై 20% వ్యాట్ (VAT) కూడా ఉంటుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో గరిష్ట పన్ను రేటు 37%గా ఉంది. ఇది యూరోపియన్ దేశాల కంటే కొంత తక్కువ. భారత్‌కు పొరుగున ఉన్న చైనాలో పన్ను గరిష్టంగా 45%గా ఉంది. ఇతర పొరుగు దేశాల విషయానికి వస్తే పాకిస్తాన్, ఇండోనేషియా, మెక్సికోలో పన్ను రేటు 35% కాగా, బంగ్లాదేశ్‌లో ఇది తులనాత్మకంగా 25% మాత్రమే ఉంది. ఇక పన్ను చాలా తక్కువగా ఉండే దేశాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు గ్వాటెమాలాలో కేవలం 7%, కజకిస్తాన్, రొమేనియా, సెర్బియాలో 10%, రష్యాలో 13% మాత్రమే పన్ను విధిస్తారు.

Tags:    

Similar News