UPI Charges: యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించే వినియోగదారులు, వ్యాపారులకు ఊరట కలిగించే వార్త ఇది. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని యూపీఐ వ్యాపార చెల్లింపులపై 0.4 శాతం MDR ఛార్జీ విధించాలన్న ప్రతిపాదన అమలులో జాప్యం జరిగే అవకాశం ఉంది. 2027లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ నిర్ణయాన్ని వాయిదా వేయవచ్చని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం వెల్లడించింది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ, NPCI నుంచి ఇప్పటివరకు అధికారికంగా తుది తేదీ ప్రకటించలేదు.

యూపీఐ ద్వారా చేసే కొన్ని వ్యాపార చెల్లింపులపై MDR ఛార్జీలు విధించాలన్న ప్రతిపాదనకు వ్యాపార సంఘాల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో 2027లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ నిర్ణయం వాయిదా పడే అవకాశం ఉందని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, NPCI మధ్య అమలు తేదీపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాతే అమలు చేయాల్సి రావడం అత్యంత ఆలస్యమైన పరిస్థితి మాత్రమేనని ఓ పరిశ్రమ ప్రతినిధి అభిప్రాయపడినట్లు కథనం పేర్కొంది. అంటే ఎన్నికల తర్వాతే అమలు చేస్తారనే అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

వాస్తవానికి ఈ MDR ఛార్జీలను 2026 అక్టోబర్ 15 నుంచే అమలు చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే పండుగల సీజన్, వ్యాపారుల అభ్యంతరాలు, అమలుకు సంబంధించిన ఏర్పాట్ల కారణంగా అక్టోబర్ 13న వాయిదా వేశారు. దీపావళి తర్వాత కొత్త తేదీ ప్రకటిస్తామని NPCI తెలిపింది. కానీ నవంబర్ 19 నాటికి కూడా స్పష్టమైన తేదీ వెల్లడించలేదు. ఇప్పుడు 2027 ఎన్నికల నేపథ్యంలో మరింత ఆలస్యం కావచ్చనే వార్తలు వస్తున్నాయి.

ప్రతిపాదిత విధానం ప్రకారం రూ.2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని వ్యక్తి నుంచి వ్యాపారికి చేసే (P2M) యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం MDR విధించనున్నారు. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ చెల్లింపులపై ఈ ఛార్జీ గరిష్ఠంగా రూ.300కు పరిమితం అవుతుంది. రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం వంటి కొన్ని ప్రత్యేక రంగాల్లో అర్హమైన రూ.2,000కు పైబడిన చెల్లింపులకు ఒక్కో లావాదేవీపై రూ.5 ఛార్జీ ప్రతిపాదించారు. అయితే వ్యక్తి నుంచి మరో వ్యక్తికి చేసే పేమెంట్లు (P2P), రూ.2,000 వరకు ఉండే వ్యాపార చెల్లింపులకు MDR ఉండదు. నెలకు QR కోడ్ ద్వారా రూ.లక్ష వరకు వసూలు చేసే చిన్న వ్యాపారులకు కూడా మినహాయింపు ఉంది.

ఇక్కడ వినియోగదారులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. MDR అనేది వ్యాపారుల నుంచి వసూలు చేసే ప్రాసెసింగ్ ఛార్జీ. దీన్ని నేరుగా కస్టమర్లపై వేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే ఈ ప్రతిపాదన అమలులోకి వచ్చినా ప్రతి ఫోన్‌పే, గూగుల్‌పే వినియోగదారుడి నుంచి అదనపు ఛార్జీ వసూలు చేస్తారనే అర్థం కాదు. సాధారణ వ్యక్తిగత బదిలీలు, రూ.2,000 లోపు వ్యాపార చెల్లింపులు ఉచితంగానే కొనసాగుతాయి.

Tags: