UPI: మన దేశంలో డిజిటల్ లావాదేవీల వినియోగం విపరీతంగా పెరిగిన తరుణంలో యూపీఐ పేమెంట్స్‌కు సంబంధించి ప్రభుత్వం కొన్ని కొత్త మార్పులు తీసుకొస్తోంది. రాబోయే అక్టోబర్ 15 నుంచి నిర్దిష్టమైన రూ.2,000 పైబడిన మర్చంట్ యూపీఐ పేమెంట్స్‌పై మర్చంట్ డిస్కౌంట్ రేట్ అంటే ఎండీఆర్ వర్తింపజేయనున్నారు. కొత్త నిబంధనల ప్రకారం అర్హత కలిగిన మర్చంట్ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ చార్జ్ వసూలు చేస్తారు. అయితే ఈ నిబంధన సాధారణ యూపీఐ వినియోగదారులపై నేరుగా ఎలాంటి భారాన్ని మోపదు. రోజువారీ చిన్నపాటి కొనుగోళ్లు చేసే 96 శాతానికి పైగా మర్చంట్ యూపీఐ లావాదేవీలు ఈ కొత్త ఎండీఆర్ పరిధిలోకి రావు. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి నేరుగా జరిపే సాధారణ బదిలీలు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయి.

ఎండీఆర్ చార్జీల పరిమితులు

ఈ ఎండీఆర్ అంటే ఏమిటి అనే సందేహం చాలా మందిలో కలుగుతుంది. డిజిటల్ పేమెంట్ సిస్టమ్‌ను నడిపించడానికి అయ్యే నిర్వహణ ఖర్చులను భరించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. కొత్త యూపీఐ నిబంధనల ప్రకారం రూ.2,000 దాటిన పీటుఎం లావాదేవీలపై 0.4 శాతం చార్జ్ విధిస్తారు. ఒకవేళ లావాదేవీ విలువ రూ.75,000 అంతకంటే ఎక్కువగా ఉంటే, ఎండీఆర్ గరిష్ట పరిమితిని ఒక్కో లావాదేవీకి రూ.300గా నిర్ణయించారు. కొన్ని ప్రత్యేకమైన తక్కువ మార్జిన్ కలిగిన రంగాల కోసం వేర్వేరు ఫ్లాట్ చార్జీల నిబంధనలను కూడా పొందుపరిచారు. మంత్రత్వ శాఖ స్పష్టం చేసిన వివరాల ప్రకారం ఈ ఎండీఆర్ అనేది నేరుగా కస్టమర్లపై రుద్దే టాక్స్ కాదు. ఇది పేమెంట్ ఎకోసిస్టమ్‌లో భాగమైన వివిధ సంస్థల మధ్య పంపిణీ అయ్యే రుసుముగా నిలుస్తుంది.

చిన్న వ్యాపారులు క్యాష్ అడగడానికి గల కారణం

సాధారణ వినియోగదారులకు నేరుగా ఎలాంటి చార్జ్ పడకపోయినా, ఈ కొత్త మార్పుల ప్రభావం చిన్న వ్యాపారుల మీద పడే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక చిన్న దుకాణదారుడు లేదా గుడ్లు అమ్మే వ్యాపారి తన హోల్‌సేల్ సప్లయర్‌కు రూ.2,000 కంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తే, ఆ పెద్ద లావాదేవీపై ఎండీఆర్ చార్జీలు వర్తిస్తాయి. దీనివల్ల వ్యాపారులకు డిజిటల్ చెల్లింపుల నిర్వహణ ఖర్చు పెరుగుతుంది. ఇదే కారణంతో రాబోయే అక్టోబర్ 15 తర్వాత పెద్ద మొత్తంలోని చెల్లింపుల కోసం నగదు ఇవ్వాలని వ్యాపారులు కోరే అవకాశం ఉంది. గతంలో జరిగిన కొన్ని ఉదాహరణలలో హోల్‌సేల్ వ్యాపారులకు ఎండీఆర్ భారం పడకుండా ఉండేందుకు కొందరు విక్రేతలు కస్టమర్లను క్యాష్ తెమ్మని కోరడం గమనించవచ్చు.

డిజిటల్ పేమెంట్ సిస్టమ్ మనుగడ కోసం మార్పులు

యూపీఐ సేవలను నిరంతరం విజయవంతంగా కొనసాగించడానికి బ్యాంకులు, పేమెంట్ యాప్‌లు, టెక్నాలజీ వ్యవస్థల వెనుక భారీ ఖర్చు అవుతుంది. ఈ ఎండీఆర్ వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా డిజిటల్ పేమెంట్ సిస్టమ్‌ను దీర్ఘకాలికంగా ఆర్థికంగా బలంగా ఉంచాలనేది ప్రధాన ఉద్దేశం. చిన్న వ్యాపారులపై, సామాన్య యూజర్లపై భారం పడకుండా ఉండేందుకు చాలా వరకు లావాదేవీలను ఈ చార్జీల నుంచి మినహాయించారు. అయినప్పటికీ అక్టోబర్ 15 తర్వాత వ్యాపారులు ఈ నిబంధనలను ఏ విధంగా స్వీకరిస్తారు, పెద్ద మొత్తాల చెల్లింపుల్లో నగదు వాడకం ఏ స్థాయిలో మారుతుందనేది త్వరలోనే స్పష్టమవుతుంది.

Tags: