UPI: యూపీఐ పేమెంట్స్‌పై అదనపు ఛార్జీల భయం.. మళ్లీ క్యాష్ వైపు అడుగులు వేస్తున్న జనాలు
జనాలు
UPI: భారతదేశంలో డిజిటల్ విప్లవానికి ప్రతీకగా నిలిచిన యూపీఐ లావాదేవీలకు త్వరలో పెద్ద పరీక్ష ఎదురుకానుంది. చిరు వ్యాపారి నుంచి పెద్ద మాల్స్ వరకు ప్రతిచోటా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లించే అలవాటు ప్రజలకు బాగానే ఉంది. అయితే రాబోయే అక్టోబర్ 15 నుంచి రూ.2,000 కంటే ఎక్కువ విలువైన P2M యూపీఐ పేమెంట్స్‌పై ఎండీఆర్ ఛార్జ్ అమల్లోకి రానుందనే వార్తలు వినియోగదారులను కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరిగిన ఒక ప్రముఖ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదనపు భారం పడితే తాము యూపీఐ సేవలను పక్కనపెట్టి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటామని వినియోక్తాలు స్పష్టం చేస్తున్నారు.
సర్వేలో వెల్లడైన విస్తుపోయే నిజాలు
ప్రముఖ సర్వే సంస్థ లోకల్‌సర్కిల్స్ దేశవ్యాప్తంగా 291 జిల్లాల్లో సుమారు 67 వేల మంది యూపీఐ యూజర్లతో ఈ సర్వే నిర్వహించింది. ఇందులో బయటపడిన గణాంకాల ప్రకారం కేవలం 14 శాతం మంది మాత్రమే అదనపు ఛార్జ్ చెల్లించడానికి సుముఖంగా ఉన్నారు. మిగిలిన వారిలో దాదాపు 76 శాతం మంది కస్టమర్లు రూ.2,000 పైబడిన పేమెంట్స్‌పై ఎలాంటి ఎక్స్ ట్రా ఛార్జ్ ఇవ్వబోమని తేల్చిచెప్పారు. ఒకవేళ వ్యాపారులు లేదా సంస్థలు ఈ ఛార్జీలు వసూలు చేస్తే తాము కచ్చితంగా పేమెంట్ పద్ధతిని మార్చుకుంటామని హెచ్చరిస్తున్నారు.
తిరిగి పాత పద్ధతికే
యూపీఐ లావాదేవీలు కాస్త ఖరీదైనవిగా మారితే ప్రజలు ఏయే మార్గాల వైపు మొగ్గు చూపుతారనే దానిపై కూడా సర్వే స్పష్టతనిచ్చింది. సర్వేలో పాల్గొన్నవారిలో 27 శాతం మంది మళ్లీ యథావిధిగా నగదు లావాదేవీలకే పరిమితమవుతామని చెప్పారు. అలాగే 26 శాతం మంది క్రెడిట్ కార్డులను, 14 శాతం మంది డెబిట్ కార్డులను ఆశ్రయిస్తామని తెలిపారు. మరోవైపు కొద్దిమంది ఎన్ఈఎఫ్టీ లేదా ఐఎంపీఎస్ వంటి పద్ధతులను ఎంచుకుంటామని అన్నారు. ఈ పరిణామాలు డిజిటల్ ఇండియా ప్రయాణానికి కొంత ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తున్నాయి.
వ్యాపారుల్లోనూ పెరుగుతున్న ఆందోళన
ఈ ఛార్జీల మోత కేవలం కస్టమర్లపైనే కాకుండా వ్యాపారులపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. సుమారు 0.4 శాతం మేರೆ పడే ఈ ఎండీఆర్ ఛార్జీని తాము భరించేది లేదని దాదాపు 41 శాతం మంది వ్యాపారులు తెగేసి చెప్పారు. చిన్న మొత్తాల లావాదేవీలకు పర్వాలేదు కానీ రూ.50,000 లాంటి పెద్ద అమౌంట్‌పై పడే ఛార్జీలను తాము భరించలేమని వారు వాపోతున్నారు. కేవలం 17 శాతం మంది వ్యాపారులు మాత్రమే ఈ భారాన్ని భరించేందుకు ముందుకొచ్చారు.
ప్రభుత్వం స్పష్టత, భవిష్యత్తు అంచనాలు
ఈ వివాదంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందిస్తూ ఎండీఆర్ ఛార్జ్ అనేది ప్రభుత్వ పన్ను కాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ రుసుమును కస్టమర్ల నుంచి వసూలు చేయకూడదని వ్యాపారులకు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ నిబంధనలు ఎంతవరకు అమలవుతాయి, ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అక్టోబర్ 15 తర్వాత మార్కెట్లో వచ్చే మార్పులను బట్టి డిజిటల్ పేమెంట్స్ భవితవ్యం ఆధారపడి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.