White Collar Jobs: అక్టోబర్‌లో వైట్ కాలర్ ఉద్యోగాల పండుగ..ఏకంగా 14 శాతం పెరిగిన రిక్రూట్మెంట్లు!
14 శాతం పెరిగిన రిక్రూట్మెంట్లు!
White Collar Jobs: భారత కార్పొరేట్ రంగంలో ఆఫీసు ఆధారిత ప్రొఫెషనల్ పనులకు సంబంధించి వైట్ కాలర్ ఉద్యోగాల నియామకాలు అక్టోబర్ నెలలో విశేషంగా పుంజుకున్నాయి. గతేడాది అక్టోబర్ నెలతో పోలిస్తే ఈసారి రిక్రూట్మెంట్లలో ఏకంగా 14 శాతం వృద్ధి నమోదైంది. ప్రముఖ జాబ్ పోర్టల్ నౌకరీ డాట్ కామ్ విడుదల చేసిన నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ ప్రకారం.. గతేడాది 2,480 పాయింట్లుగా ఉన్న సూచీ ఈ ఏడాది అక్టోబర్ నాటికి 2,836 పాయింట్లకు చేరుకుంది. పండుగల సీజన్ ప్రభావంతో పాటు విభిన్న రంగాల్లో తయారీ సామర్థ్యం పెరుగుతుండడం ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
మ్యానుఫ్యాక్చరింగ్, ఏఐ స్కిల్స్‌కు భారీ డిమాండ్
వివిధ రంగాలను పరిశీలిస్తే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో వైట్ కాలర్ ఉద్యోగాలకు అత్యధికంగా 39 శాతం మేర డిమాండ్ పెరిగింది. ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధిత ఉద్యోగ నియామకాల్లో సంస్థలు తీవ్ర ఆసక్తి చూపిస్తున్నాయి. దీనితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకు మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రత్యేకమైన ఏఐ పాత్రలకు సంబంధించిన నియామకాల్లో 32 శాతం వృద్ధి కనిపించింది. అలాగే ఆటోమొబైల్, బీపీఓ, ఐటీఈఎస్ రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయి.
మెట్రో నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానం
వైట్ కాలర్ ఉద్యోగాల నియామకాల్లో దేశంలోని ప్రముఖ మెట్రో నగరాల జాబితాలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ నగరంలో రిక్రూట్మెంట్ కార్యకలాపాలు అత్యధికంగా 15 శాతం వృద్ధిని నమోదు చేశాయి. హైదరాబాద్ తర్వాత పుణె 14 శాతంతో రెండో స్థానంలో నిలవగా, ఢిల్లీ-ఎన్సీఆర్ 13 శాతంతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. బెంగళూరు, ముంబై నగరాలు చెరో 12 శాతం వృద్ధి నమోదు చేయగా, చెన్నై 11 శాతం సాధించింది. కోల్‌కతా నగరంలో మాత్రం ఉద్యోగ నియామకాలు క్రితం ఏడాదితో సమానంగా స్థిరంగా కొనసాగాయి.
చిన్న నగరాల్లో గాంధీనగర్ హవా
ట్విన్ సిటీలు, ద్వితీయ శ్రేణి అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఉద్యోగాల కల్పన వేగవంతంగా జరుగుతోంది. గుజరాత్‌లోని గాంధీనగర్ అత్యధికంగా 48 శాతం వృద్ధితో సరికొత్త రికార్డు సృష్టించింది. ఆ తర్వాత సూరత్ 36 శాతం, రాయ్‌పూర్ 34 శాతం, వడోదర 30 శాతం, రాంచీ 29 శాతం, జైపూర్ 26 శాతం, అహ్మదాబాద్ 23 శాతం వృద్ధి సాధించాయి. వేగంగా ఎదుగుతున్న టాప్ 7 నగరాలలో ఏకంగా నాలుగు నగరాలు ఒక్క గుజరాత్ రాష్ట్రం నుంచే ఉండడం విశేషం. చిన్న పట్టణాల్లో కార్పొరేట్ ఆఫీసుల సంఖ్య పెరగడం ఇక్కడి నిరుద్యోగులకు ఊరటనిస్తోంది.
ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు ఎలా ఉన్నాయంటే
ఎఫ్ఎమ్సీజీ రంగంలో ప్రొడక్షన్ పనుల నియామకాలకు 40 శాతం, ప్రొక్యూర్మెంట్ విభాగానికి 20 శాతం డిమాండ్ పెరిగింది. మరోవైపు ఐటీ/సాఫ్ట్వేర్ సేవల విభాగంలో వైట్ కాలర్ ఉద్యోగాలు 5 శాతం స్వల్ప వృద్ధితో కాస్త మందగించాయి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, క్వాలిటీ అస్యూరెన్స్ వంటి విభాగాల్లో సాధారణ నియామకాలు కేవలం 1 శాతమే నమోదయ్యాయి. సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగాల కంటే కూడా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, ప్రత్యేకమైన ఏఐ ఉద్యోగాల వైపే కస్టమర్లు మొగ్గు చూపుతుండడం విశేషం.