Zomato: దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ తరుణంలో ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో తన యాప్‌లో క్యాష్-ఆన్-డెలివరీ (సీఓడీ) ఆప్షన్‌ను ఎంచుకునే వినియోగదారులపై ప్రత్యేకంగా డెలివరీ సమయంలో చెల్లించే ఫీజును వసూలు చేయడం ప్రారంభించింది. శనివారం నాటికి యాప్‌లో గమనించిన వివరాల ప్రకారం.. ఈ చార్జ్ అందరికీ ఒకేలా లేదు. ఆర్డర్ విలువ అలాగే యూజర్ల ప్రవర్తన ఆధారంగా ఈ రుసుములో మార్పులు ఉంటున్నట్లు తెలుస్తోంది.

అధికారిక ప్రకటన లేని వైనం

ఈ కొత్త చార్జీని ఏ ప్రాతిపదికన లెక్కిస్తున్నారనే దానిపై కంపెనీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. ఆర్డర్ మొత్తం, లొకేషన్ లేదా ఇతర కారణాల వల్ల ఈ రుసుము మారుతోందా అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు ప్రధాన ప్రత్యర్థి అయిన స్విగ్గీ మాత్రం ఇప్పటివరకు క్యాష్-ఆన్-డెలివరీ ఆర్డర్లపై ఎలాంటి ప్రత్యేక చార్జీలను వసూలు చేయడం లేదు. కేవలం జొమాటో మాత్రమే ఈ కొత్త ప్రయోగానికి తెరలేపడం గమనార్హం.

చిన్న చార్జీల ద్వారా వేల కోట్ల ఆదాయం

జొమాటో రోజువారీగా దేశవ్యాప్తంగా సుమారు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు లక్షల ఆర్డర్లను ప్రాసెస్ చేస్తోంది. ఈ భారీ సంఖ్యలో ఆర్డర్లు వచ్చే వేదికపై చిన్న మొత్తంలో ఫీజు వసూలు చేసినా కూడా కంపెనీకి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుంది. ఒక్కో ఆర్డర్‌పై ఐదు రూపాయల అదనపు చార్జ్ వేసినా రోజువారీగా కోట్లలో ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఏడాదివారీగా చూస్తే ఈ చిన్న చార్జీల రూపంలో వందల కోట్ల రూపాయలు కంపెనీ ఖజానాలోకి చేరనున్నాయి.

ఇప్పటికే అమల్లో ఉన్న ఇతర ఫీజులు

కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించిన ప్లాట్‌ఫారమ్ ఫీజు క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ప్లాట్‌ఫారమ్ ఫీజుతో పాటు డెలివరీ చార్జీలు, ప్యాకేజింగ్ రుసుములు, జీఎస్టీ వంటి రకరకాల పేర్లతో వినియోగదారుల బిల్లు భారీగా పెరుగుతోంది. ఇప్పుడు దీనికి తోడుగా సీఓడీ ఫీజు కూడా తోడవడంతో ఫుడ్ లవర్స్ ఆన్‌లైన్ ఆర్డర్లు చేయడం భారంగా మారుతోంది.

Tags: