'Shanarthi': అఖిల్ రాజ్, నాగదుర్గ కాంబోలో శనార్తి
శనార్తి
'Shanarthi': వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు సంపత్ నందికి చెందిన 'సంపత్ నంది టీమ్‌వర్క్స్' బ్యానర్, శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్‌కు చెందిన కె.వి. శ్రీధర్ రెడ్డితో కలిసి తమ రెండో ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రకటించింది. ఆదిత్య మూవీస్ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఈ నూతన చిత్రానికి శనార్తి అనే వైవిధ్యమైన టైటిల్‌ను ఖరారు చేశారు.
'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రంతో ఆకట్టుకున్న అఖిల్ రాజ్ ఇందులో కథానాయకుడిగా నటిస్తుండగా, తెలంగాణ జానపద పాటలతో ఎంతో ప్రజాదరణ పొందిన నాగదుర్గ కథానాయికగా నటిస్తోంది. సంపత్ నంది వద్ద శిష్యరికం చేసిన రాజ్ గణేష్ ఉప్పునూటి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గ్రామీణ తెలంగాణలో ఒకరినొకరు గౌరవంగా పలకరించుకోవడానికి వాడే 'నమస్కారం' వంటి సాంప్రదాయ పదమే ఈ 'శణార్తి'.
తాజాగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌లో పసుపు, ఎరుపు రంగులు పూసుకున్న రెండు చేతులు ఒకదానినొకరు పట్టుకుని ఉన్న చిత్రం ఆకట్టుకుంటోంది. సంస్కృతి, బంధాలకు ప్రతీకగా ఉన్న ఈ పోస్టర్‌పై "ఎ టేల్ ఆఫ్ కల్చర్" అనే ట్యాగ్‌లైన్ సినిమా కథాంశంపై ఆసక్తిని పెంచుతోంది.
సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో సినీ ప్రముఖులు మరియు చిత్రబృందం సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.