రెండు రోజులు ఒకటే షిఫ్ట్.. 24 గంటలు నిరంతరంగా పనిచేసిన అమితాబ్ బచ్చన్.. KBC కోసం అంకితభావం!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి తన వృత్తిపట్ల ఉన్న అంకితభావాన్ని చాటుకున్నారు. 83 ఏళ్ల వయసులోనూ ఆయన 24 గంటల పాటు నిరంతరంగా పనిచేసి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రముఖ క్విజ్ రియాలిటీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) సీజన్-18' షూటింగ్ కోసం ఉదయం 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు ఎలాంటి విరామం లేకుండా పని చేసినట్లు స్వయంగా వెల్లడించారు.

తన బ్లాగ్‌లో అమితాబ్ బచ్చన్ ఈ విషయాన్ని పంచుకుంటూ.. "నిన్న ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పని ఈరోజు ఉదయం 7 గంటలకు పూర్తైంది. కార్యక్రమం సమయానికి ప్రేక్షకుల ముందుకు రావాలంటే ఈ పని తప్పనిసరిగా పూర్తి చేయాల్సి వచ్చింది. అందుకే 24 గంటలపాటు పనిచేశాను" అని పేర్కొన్నారు.

"షూటింగ్ మిస్ అయితే ఉద్యోగమే పోయేది"

షో ప్రసార తేదీ ప్రకటించిన నేపథ్యంలో ఎలాంటి ఆలస్యం చేయడానికి అవకాశం లేదని అమితాబ్ తెలిపారు. "KBC తొలి ప్రసార తేదీ ప్రకటించారు. ఈ షెడ్యూల్‌ను మిస్ అయితే నా స్థానంలో మరొకరిని తీసుకునే పరిస్థితి వచ్చేది. అందుకే చేయాల్సిన పని పూర్తిచేశాను" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

షూటింగ్ పూర్తయిన తర్వాత తన రోజువారీ బ్లాగ్ రాయడం కూడా పూర్తి చేశానని, ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు మళ్లీ తెల్లవారుజామున షూటింగ్‌కు హాజరుకావాల్సి ఉందని వెల్లడించారు.

83 ఏళ్ల వయసులోనూ అదే జోష్

83 ఏళ్ల వయసులో కూడా అమితాబ్ బచ్చన్ అదే ఉత్సాహంతో వరుస ప్రాజెక్టుల్లో పాల్గొంటూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. KBC సీజన్-18 కోసం ఆయన చూపిస్తున్న నిబద్ధత అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఆగస్టు 10 నుంచి KBC సీజన్-18

'కౌన్ బనేగా కరోడ్‌పతి' సీజన్-18 ఆగస్టు 10 నుంచి రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ మరియు Sony LIVలో ప్రసారం కానుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి వారం ప్రేక్షకులను అలరించనుంది.

ఈసారి షోకు "సోచ్‌నా పడేగా" అనే థీమ్‌ను ఎంపిక చేశారు. నేటి ప్రపంచంలో సమాచారం అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ, ఆ సమాచారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అనుసంధానం చేయాలి, సరైన సందర్భంలో ఎలా ఉపయోగించాలి అనే ఆలోచన కలిగించేలా ఈ సీజన్‌ను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Tags: