Anaswara Rajan: కేరళకు చెందిన యువ నటి అనస్వర రాజన్‌ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. రోషన్‌ మేకా నటించిన ‘ఛాంపియన్‌’ సినిమాతో తొలిసారి తెలుగు తెరపై కనిపించిన ఆమె.. చిరంజీవి నటిస్తున్న ‘కాకా’లో అవకాశం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. నవంబరు 13న విడుదల కానున్న ‘ఇట్లు అర్జున’ సినిమా సందర్భంగా ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలు, అభిరుచులు, ఆదర్శ రొమాంటిక్‌ డేట్‌ గురించి మనసు విప్పి మాట్లాడింది.

హైదరాబాద్‌లో తనకు బాగా నచ్చేది నీలోఫర్‌ బన్‌ మస్కా అని చెప్పిన అనస్వర.. ఎవరూ గుర్తుపట్టకుండా క్యాప్‌ పెట్టుకుని తినడానికి వెళ్తానని చెప్పింది. అయినా కొందరు గుర్తుపట్టేశారని నవ్వుతూ అన్నది. తెలుగు ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలు చూస్తారని, వారి అభిమానం చూసి తను ఆశ్చర్యపోయానని చెప్పింది.

స్కూల్‌ రోజుల్లో మోనో యాక్టింగ్‌, స్కిట్స్‌లో పాల్గొన్నా సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదని అనస్వర చెప్పింది. ఓ సినిమా ఆడిషన్‌ ప్రకటన చూసి కుటుంబ స్నేహితులు ప్రోత్సహించడంతో ఆడిషన్‌కు వెళ్లానని, దాదాపు 6 వేల మందిలో నుంచి తనను ఎంపిక చేయడం నమ్మలేకపోయానని గుర్తుచేసుకుంది.

‘కాకా’ సినిమాలో చిరంజీవితో కలిసి నటించడం గొప్ప అనుభవమని చెప్పిన ఆమె.. ఆయన వ్యక్తిత్వం, సెట్‌లో ప్రొఫెషనల్‌గా ఉంటూనే సరదాగా గడిపే తీరు నేర్చుకోదగ్గవని ప్రశంసించింది. అల్లు అర్జున్‌కు పెద్ద ఫ్యాన్‌నని, ఆయన సినిమాలను మలయాళంలో డబ్బింగ్‌ చూసి స్నేహితులతో కలిసి థియేటర్లో గోల చేసేవాళ్లమని చెప్పింది. ఇప్పటివరకు ఆయన్ను కలవలేదని చెప్పుకుంది.

తన చర్మం బాగుండటానికి రోజూ సన్‌స్క్రీన్‌, మాయిశ్చరైజర్‌ వాడుతానని, నీళ్లు ఎక్కువగా తాగుతానని చెప్పింది. ఐదేళ్ల క్రితం స్పోర్ట్స్‌ ఆడేవాళ్లమని, అప్పుడు సన్‌స్క్రీన్‌ వల్ల చర్మం ట్యాన్‌ కాలేదని అన్నది. అబ్బాయిల్లో ఎమోషనల్‌ మెచ్యూరిటీ, మృదువైన మాటలు ఇష్టమని, ఆల్ఫా రకం అబ్బాయిలు నచ్చరని స్పష్టం చేసింది. బాహ్యరూపం కంటే వ్యక్తిత్వం, మాట్లాడే తీరే ముఖ్యమని అన్నది.

ఎక్స్‌ (ట్విట్టర్‌) ఖాతా ఉన్నా పెద్దగా వాడనని, కొందరు అభిమానులు ప్రతి పోస్ట్‌కు లైక్‌, కామెంట్‌ పెడుతుంటారని చెప్పింది. ‘సూపర్‌ శరణ్య’లో కలిసి నటించిన మమితా బైజు తనకు మంచి స్నేహితురాలని, ఆరోగ్యం బాగాలేనప్పుడు తోడుగా ఉండేదని గుర్తుచేసుకుంది. తన అక్కతో నాలుగేళ్ల తేడా ఉందని, ప్రతి విషయం తనతోనే పంచుకుంటానని, ఆమెనే బెస్ట్‌ ఫ్రెండ్‌గా భావిస్తానని చెప్పింది.

8 ఏళ్ల క్రితం న్యూ ఇయర్‌ రాత్రి అక్కతో కలిసి బయట తిరిగి వచ్చినప్పుడు అమ్మ తిట్టి ఇంట్లోకి రానివ్వకపోవడంతో కజిన్‌ ఇంట్లోనే పడుకోవాల్సి వచ్చిన సంఘటనను గుర్తుచేసుకుంది. సోలో ట్రిప్‌ కోసం స్కాట్లాండ్‌కు ఒక్కరే వెళ్లిన అనుభవం మర్చిపోలేనిదని అన్నది.

రొమాంటిక్‌ డేట్‌ గురించి తనకు కొన్ని కలలున్నాయని చెప్పిన అనస్వర.. పూలంటే చాలా ఇష్టమని, డేట్‌కు వచ్చే అబ్బాయి సన్‌ఫ్లవర్స్‌, వైట్‌ పియానీస్‌ పూలు తీసుకురావాలని కోరుకుంది. ఇద్దరూ ప్రకృతి అందాలను చూస్తూ మనసు విప్పి మాట్లాడుకోవాలని ఆమె కలలు కన్నది.

అనస్వర రాజన్‌ ఇలా తన అనుభవాలు, అభిరుచులు, ఆదర్శ డేట్‌ గురించి స్వేచ్ఛగా మాట్లాడటం ప్రేక్షకులకు ఆమెను మరింత దగ్గర చేసింది. ‘ఇట్లు అర్జున’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు మరోసారి రాబోతున్న ఆమెను అందరూ ఎదురుచూస్తున్నారు.

Tags: