Indian 3: రెండేళ్ల తర్వాత మళ్లీ ట్రాక్‌లోకి.. భారతీయుడు 3 రీస్టార్ట్
భారతీయుడు 3 రీస్టార్ట్
Indian 3: 20వ దశకంలో సంచలన విజయం సాధించిన ‘ఇండియన్’ (భారతీయుడు) సినిమా ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలు ‘భారతీయుడు’లోని అంశాలను స్ఫూర్తిగా తీసుకున్నాయి.
అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2) మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. 2024లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో దర్శకుడిపై ఒత్తిడి మరింత పెరిగింది.
మరోవైపు ‘భారతీయుడు 2’, ‘భారతీయుడు 3’ చిత్రాలను రెండు భాగాలుగా నిర్మించేందుకు ముందుకొచ్చిన లైకా ప్రొడక్షన్స్ కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. దీంతో ‘భారతీయుడు 3’ ప్రాజెక్ట్ దాదాపు రెండేళ్ల పాటు హోల్డ్‌లోకి వెళ్లింది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌ను మళ్లీ పట్టాలెక్కించాలని శంకర్ అండ్ టీమ్ నిర్ణయించింది. లైకా ప్రొడక్షన్స్ కొత్త పోస్టర్లను విడుదల చేస్తూ ‘భారతీయుడు 3’ తిరిగి ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటించింది.
“సేనాపతి ఈజ్ బ్యాక్ విత్ జీరో టాలరెన్స్.. ది రిసర్జెన్స్ బిగిన్స్.. #Indian3 ఇన్ వార్ మోడ్” అంటూ లైకా చేసిన ప్రకటన ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలో కమల్ హాసన్‌తో పాటు కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాజల్‌కు సంబంధించిన సన్నివేశాలను శంకర్ గతంలోనే చిత్రీకరించినప్పటికీ.. ఆమె పాత్ర ‘భారతీయుడు 2’లో కనిపించలేదు. దీంతో ఆమెకు సంబంధించిన సన్నివేశాలు మూడో భాగంలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘భారతీయుడు 2’తో పోయిన క్రేజ్‌ను ‘భారతీయుడు 3’తో కమల్ హాసన్, శంకర్ తిరిగి తీసుకురాగలరా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ‘వార్ మోడ్’లోకి వచ్చిన సేనాపతి.. ఈసారి ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.