బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కు మధ్య ప్రదేశ్ హైకోర్ట్ షాక్
ఆయన కుటుంబం ఆస్తులు ఎనిమీ ప్రాపర్టీనే అని తీర్పు సందిగ్ధంలో 15వేల కోట్ల విలువైన ఆస్తులు;
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కు మధ్యప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. తన పూర్వికులకు సంబంధించి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ప్రభుత్వం ఎనిమీ ప్రాపర్టీగా గుర్తించడాన్ని సవాల్ చేస్తూ సైఫ్ ఆలీఖాన్ దాఖలు చేసిన పిటీషన్ను మధ్యప్రదేశ్ హైకోర్టు శనివారం కొట్టివేసింది. సైఫ్ కుటుంబానికి చెందిన 15వేల కోట్ల రూపాయల విలువ గల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా నిర్ణయిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై మరో సారి విచారణ జరిపి సంవత్సరం లోగా తుది నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో సైఫ్ కుటుంబ ఆస్తుల యాజమాన్య హక్కు సందిగ్దంలో పడినట్లైంది.
సైఫ్ అలీఖాన్ నాయనమ్మ సాజిదా సుల్తానా నుంచి సైఫ్ కుటుంబానికి భోపాల్ లో పలు విలువైన భవంతులు వారసత్వంగా వచ్చాయి. భోపాల్ చివరి నవాడు హమీదుల్లా ఖాన్ కుమర్తె సాజిదా పటౌడీ నవాడు అయిన ఇఫ్తికార్ అలీఖాన్ ను వివాహమాడారు. అయితే హమీదుల్లా ఖాన్ పెద్ద కుమార్తె అబీదా సుల్తానా దేశ విభజన జరిగిన తరువాత 1950వ సంవత్సరంలో పాకిస్తాన్ దేశానికి వలస వెళ్లిపోయారు. అయితే హమీదుల్లాకు చట్టబద్దమైన వారసురాలు అబీదా మాత్రమే అని సాజిదా కాదని… అబీదా పాకిస్తాన్ వెళ్లిపోవడంతో హమీదుల్లాకు చెందిన ఆస్తులన్నీ ఎనిమీ యాక్ట్ కింద కాందిశీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం 2015వ సంవత్సరంలో ప్రకటించింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సైఫ్ అలీఖాన్ కుటుంబం మధ్య ప్రదేశ్ హైకోర్టులో పిటీషన్ వేసింది. తాజా హైకోర్టు నిర్ణయంతో సైఫ్ అలీ ఖాన్ ఆస్తులు ఎనిమి యాక్ట్ పరిధిలోకి వెళ్లినట్లైంది.