Director Nitesh Tiwari: రామాయణంలో ఏఐ వివాదంపై డైరెక్టర్ నితేశ్ తివారీ క్లారిటీ.. డబ్బింగ్ వాస్తవం ఇదే..
డబ్బింగ్ వాస్తవం ఇదే..
Director Nitesh Tiwari: ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక దృశ్యకావ్యం రామాయణం: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా డబ్బింగ్ ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడారంటూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. తాజాగా ఈ రూమర్లపై దర్శకుడు నితేశ్ తివారీ పూర్తి స్పష్టతనిచ్చారు. లాస్ ఏంజెలెస్‌లోని ప్రతిష్టాత్మక అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో నిర్వహించిన వరల్డ్ ప్రీమియర్ వేదికగా ఆయన మాట్లాడారు. డబ్బింగ్ కోసం ఏఐని ఉపయోగించలేదని, ప్రతి పాత్రకూ ప్రతిభావంతులైన అసలైన డబ్బింగ్ ఆర్టిస్టులే తమ గాత్రదానం చేశారని ఆయన స్పష్టం చేశారు. అయితే విభిన్న భాషల ప్రేక్షకులకు సహజమైన అనుభూతిని అందించేందుకు, డైలాగ్స్‌కు అనుగుణంగా నటీనటుల పెదవుల కదలికలను సరిచేసేందుకు మాత్రమే బ్రహ్మ ఏఐ సాంకేతికతను వినియోగించినట్లు ఆయన వెల్లడించారు.
మరోవైపు సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, ట్రోలింగ్లపై ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కూడా గతంలో స్పందిస్తూ.. "ముందు విమర్శిస్తారు, సినిమా చూశాక వాళ్లే క్షమాపణలు చెబుతారు" అంటూ సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యశ్ నటిస్తున్న ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రను సన్నీ దేవోల్ పోషిస్తున్నారు. హాలీవుడ్ లెజెండరీ కంపోజర్ హన్స్ జిమ్మర్తో కలిసి ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ విజువల్ వండర్ నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.