Govinda: బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా వ్యక్తిగత జీవితం చుట్టూ ముసురుకున్న వివాదం మరింత ముదిరింది. కొత్త నటి రాణి స్వర్ణకార్‌తో ఆయన సాగిస్తున్న సాన్నిహిత్యంపై భార్య సునీతా అహుజా తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో వీరిద్దరూ కలిసి బహిరంగంగా కనిపించడం మరోసారి బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ముంబైలోని ప్రసిద్ధ లాల్‌బాగ్చా గణనాథుడిని గోవిందా, రాణి స్వర్ణకార్ కలిసి దర్శించుకున్నారు.

తెల్లటి సంప్రదాయ కుర్తా-పైజామాలో గోవిందా, ఎరుపు-ఆకుపచ్చ రంగు దుస్తుల్లో రాణి ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి హారతి ఇచ్చారు. ఈ పూజలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో, వీరిద్దరి బంధంపై వస్తున్న ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్లయింది.

రూపా చిత్రంతో గోవిందా వెండితెరపై రీ-ఎంట్రీ ఇస్తుండగా, అందులో రాణి స్వర్ణకార్ హీరోయిన్‌గా నటిస్తోంది. గత జులైలో ఆమెను మీడియాకు పరిచయం చేసినప్పటి నుంచే కుటుంబంలో విభేదాలు భగ్గుమన్నాయి. 62 ఏళ్ల వయసులో కూతురి వయసున్న నటితో గోవిందా సంబంధం పెట్టుకుని తనను మోసం చేస్తున్నారని ఆయన భార్య సునీత పాడ్‌కాస్ట్‌లు, ఇంటర్వ్యూల వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాకుండా రాణి ఆహార్యం, దుస్తులపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ ఆరోపణలను గోవిందా తీవ్రంగా తిప్పికొట్టారు. తనను బద్నాం చేసేందుకు భార్య వెనుక ఓ ప్రత్యేక బృందం పనిచేస్తోందని, వారి అసలు రంగు త్వరలోనే బయటపడుతుందని ఆయన హెచ్చరించారు. భవిష్యత్తులో తన అవసరం ఆమెకు వస్తుందని, పాడ్‌కాస్టుల్లో పరువు తీసే వ్యాఖ్యలు చేయడం మాని హద్దుల్లో ఉండాలని సునీతకు గట్టి కౌంటర్ ఇచ్చారు. గతంలో ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఒకరికొకరు మద్దతుగా నిలిచిన ఈ దంపతులు, ఇప్పుడు నటి రాణి కారణంగా బహిరంగంగా పరస్పర ఆరోపణలు చేసుకుంటూ వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Tags: