‘Hanuman’ Star Teja Sajja: హనుమాన్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌తో దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తేజ సజ్జా త్వరలోనే బ్యాచిలర్ జీవితానికి వీడ్కోలు పలకబోతున్నాడు. తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ప్రైవేట్‌గా ఉంచే ఈ యువ నటుడు, పెద్దలు కుదిర్చిన సంబంధంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు అధికారికంగా వెల్లడించి అభిమానులకు తీపి కబురు అందించాడు.

రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్.. హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్..

తేజ సజ్జా వివాహ వేడుకలు వచ్చే నెల నుంచే ప్రారంభం కానున్నాయి. నవంబర్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరగనుంది. డిసెంబర్ నెలలో రాజస్థాన్‌లోని చారిత్రక నగరం ఉదయ్‌పూర్ వేదికగా వివాహ వేడుక ఘనంగా జరగనుంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు హాజరుకానున్నారు. అనంతరం టాలీవుడ్ ప్రముఖులు, స్నేహితుల కోసం హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించనున్నారు.

సినిమా నేపథ్యం లేని టెక్కీతో ఏడడుగులు..

తనకు కాబోయే అర్థాంగి వివరాలపై సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొనగా, ఆమె నేపథ్యంపై తేజ స్పష్టత ఇచ్చాడు. ఈ సంబంధాన్ని తమ తల్లిదండ్రులే కుదిర్చారని, పూర్తిగా పెద్దలు నిర్ణయించిన పెళ్లి అని స్పష్టం చేశాడు. కాబోయే వధువు కుటుంబానికి సినీ రంగానికి ఎలాంటి సంబంధం లేదు. వారు టెక్నాలజీ రంగంలో స్థిరపడ్డారు. ఆమె అమెరికాలోనే పెరిగారని, ప్రస్తుతం తన తండ్రితో కలిసి టెక్ ఫీల్డ్‌లో పనిచేస్తున్నారని తెలిపాడు. సినీ ప్రచార హడావుడి, గ్లామర్ ప్రపంచానికి దూరంగా సాధారణ జీవితం గడపడం తనకు బాగా నచ్చిందని.. పెళ్లి తర్వాత కూడా ఆమె ప్రైవసీని గౌరవిస్తూ వివరాలను గోప్యంగా ఉంచుతున్నట్లు పేర్కొన్నాడు.

కెరీర్ పరంగానూ ఫుల్ బిజీ!

బాలనటుడిగా ప్రయాణం ప్రారంభించి హనుమాన్, మిరాయ్ వంటి చిత్రాలతో విజయవంతమైన హీరోగా ఎదిగిన తేజ సజ్జా, ప్రస్తుతం కెరీర్‌లో సరికొత్త పాత్రలో మెప్పిస్తున్నాడు. ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతున్న ది ట్రైటర్స్ తెలుగు సీజన్-1 ద్వారా హోస్ట్‌గా మారి తన వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటున్నాడు. ఒకవైపు కెరీర్ పరంగా విజయాలు అందుకుంటూనే, మరోవైపు జీవితంలో అత్యంత కీలకమైన కొత్త అధ్యాయానికి సిద్ధమవుతున్న తేజ సజ్జాకు సినీ ప్రముఖులు, అభిమానులు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Tags: