Rashmika Mandanna: సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాటి నుంచి తనపై వస్తున్న విమర్శలు, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై నటి రష్మిక మందన్న స్పందించారు. నటన, డైలాగ్ డెలివరీతో పాటు హిందీ సినిమాల్లో దక్షిణాది యాస వినిపిస్తోందంటూ కొందరు చేస్తున్న నెగెటివ్ కామెంట్లపై ఆమె మాట్లాడారు. పాపులర్ టాక్ షో కాఫీ విత్ కరణ్ లో విజయ్ దేవరకొండతో కలిసి పాల్గొన్న రష్మిక, తన కెరీర్ ప్రయాణంలో ఎదురవుతున్న ట్రోల్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

సహజమైన యాసను తప్పుపట్టడం సమంజసం కాదు

కెరీర్ ప్రారంభం నుంచే ఏదో ఒక అంశంపై తనను టార్గెట్ చేస్తూనే ఉన్నారని రష్మిక పేర్కొన్నారు. ‘‘నేను సౌత్ నుంచి వచ్చాను కాబట్టి నా మాటల్లో సహజంగానే ఆ యాస ఉంటుంది. దాన్ని తప్పుగా చూడటంలో ఎలాంటి అర్థం లేదు. నా నటన, భాష, పలికే తీరు.. ఇలా ప్రతి విషయంలోనూ నన్ను విమర్శించారు. అయితే ఇలాంటి ట్రోలింగ్స్ చూసి నన్ను నేను ఒకే భాషకు లేదా పరిమితులకు కట్టడి చేసుకోవాలనుకోలేదు. కొత్త అవకాశాలను ఎప్పుడూ దూరం చేసుకోను’’ అని ఆమె స్పష్టం చేశారు.

డబ్బింగ్‌కు దర్శకులే ప్రాధాన్యత ఇస్తారు

మల్టీ లాంగ్వేజ్ సినిమాల్లో డబ్బింగ్ చెప్పే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని రష్మిక తెలిపారు. తన వాయిస్ కంటే వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయిస్ సరిపోతుందని భావిస్తే తప్పకుండా వాడొచ్చని దర్శకులకు చెబుతుంటానని ఆమె అన్నారు. అయితే తన దర్శకులంతా తన ఒరిజినల్ వాయిస్‌తోనే డబ్బింగ్ చెప్పించడానికే మొగ్గు చూపారని, పలు భాషల్లో స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం సవాలుతో కూడుకున్నప్పటికీ ఎంతో సంతృప్తినిస్తుందని ఆమె వివరించారు.

Tags: