Sai Pallavi: దర్శకుడు నితేశ్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక దృశ్యకావ్యం రామాయణ. ఈ చిత్రంలో సీతాదేవిగా నటిస్తున్న నేచురల్ బ్యూటీ సాయిపల్లవి, ఆ పాత్రను పోషించడం తనకు దక్కిన అత్యంత అరుదైన, ఆధ్యాత్మిక అనుభవంగా పేర్కొన్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ఆమె అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి 18 వేదికపై సందడి చేశారు. ఈ సందర్భంగా సీత పాత్ర ఎంపిక, ప్రిపరేషన్ గురించి అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు. ‘‘సాధారణంగా ఏదైనా ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు ఆ పాత్రకు నా నటనతో ఏం న్యాయం చేయగలను, ఎంత కొత్తగా చూపించవచ్చని లెక్కలు వేసుకుంటా. కానీ సీతమ్మ పాత్ర దగ్గరకు వచ్చేసరికి నా ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టేశా. నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించలేదు. ఈ పాత్ర ద్వారా నేను ఎంత నేర్చుకోగలను, ఎంత జ్ఞానాన్ని గ్రహించగలనన్నదే ముఖ్యం అనుకున్నా. చివరకు షూటింగ్ సెట్‌లోకి వెళ్లేటప్పుడు.. అమ్మా.. నాతో ఈ పాత్ర నువ్వే చేయించుకో అని సీతాదేవినే వేడుకుని కెమెరా ముందుకు వచ్చా’’ అని ఆమె వివరించారు. సాయిపల్లవి చెప్పిన విధానం, ఆమె వినమ్రతను చూసి అమితాబ్ బచ్చన్ ముగ్ధులై ప్రశంసలు కురిపించారు.

భారతీయ సినీ చరిత్రలోనే భారీ తారాగణంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, లంకేశ్వరుడు రావణుడిగా కన్నడ స్టార్ యశ్, లక్ష్మణుడిగా రవి దూబే, ఆంజనేయుడి పాత్రలో సన్నీ దేవోల్ అలరించనున్నారు. రెండు భాగాలుగా సిద్ధమవుతున్న ఈ భారీ విజువల్ వండర్ తొలి భాగం 2026 నవంబరు 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Tags: