Yash: సెట్‌లో కియారాకు బాడీగార్డ్‌లా ఉన్నాను.. టాక్సిక్ షూటింగ్ పై యశ్..
టాక్సిక్ షూటింగ్ పై యశ్..
Yash: పాన్-ఇండియా స్టార్ యశ్, బాలీవుడ్ భామ కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ టాక్సిక్: ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్. ముంబైలో అట్టహాసంగా జరిగిన ఈ చిత్ర ఆడియో లాంచ్ వేడుకలో యశ్ మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో కియారా అద్వానీ గర్భవతిగా ఉన్నారని, ఆ సమయంలో ఆమెకు అండగా నిలిచిన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ఈ చిత్రంలో కియారా పోషించిన పాత్ర ఎంతో శ్రమతో కూడుకున్నదని, ఆమె ప్రెగ్నెన్సీ విషయం తెలిశాక యూనిట్ మొత్తం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని యశ్ తెలిపారు.
ఆమె కంటే మాకే ఎక్కువ టెన్షన్
కియారా డెడికేషన్ గురించి యశ్ మాట్లాడుతూ.. "ఆమె ఎంతో ప్రొఫెషనల్ యాక్టర్. శ్రమతో కూడిన సీన్లు చేయాల్సి వచ్చినప్పుడు ఆమె పరిస్థితి చూసి దర్శకురాలు గీతూ మోహన్‌దాస్, నేను చాలా ఆందోళన చెందాం. ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సెట్‌లో మేము బౌన్సర్లు, బాడీగార్డుల్లా ఉంటూ కంటికి రెప్పలా చూసుకున్నాం. గర్భవతిగా ఉన్నప్పటికీ ఆమె చూపించిన 100 శాతం నిబద్ధత నిజంగా ప్రశంసనీయం" అని ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.
నాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు: కియారా అద్వానీ
ఇంతకుముందు బెంగళూరులో జరిగిన ట్రైలర్ లాంచ్ వేదికగా కియారా మాట్లాడుతూ.. చిత్రంలో తన పాత్ర నాదియా' గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "ఒక నటిగా ఇంతటి డేరింగ్ పాత్రను నేను చేయగలనని నాకంటే ముందే హీరో యశ్, దర్శకురాలు గీతూ గుర్తించారు. నాదియా పాత్ర నా సినీ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది" అని స్పష్టం చేశారు. యశ్, గీతూలు సెట్‌లో కల్పించిన సదుపాయాలు, భద్రతా వాతావరణం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెబుతూ.. "మీరిచ్చిన ఈ అద్భుత అనుభవంతో ఇకపై చేయబోయే ప్రతి సినిమా సెట్‌లోనూ ఇలాంటి కేరింగ్ వాతావరణాన్నే ఆశిస్తానేమో" అని సరదాగా చమత్కరించారు.