Maharashtra CM Devendra Fadnavis: రామాయణకు ఆస్కార్ రాకపోతే తీవ్రంగా నిరాశ చెందుతా: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
Maharashtra CM Devendra Fadnavis: భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణ'. ఈ సినిమాపై తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ముంబైలోని ఫిల్మ్‌సిటీలో ప్రముఖ నిర్మాత మల్హోత్రాకు చెందిన 'ప్రైమ్ ఫోకస్ స్టూడియో' విస్తరణలో భాగంగా సరికొత్త 'ప్రైమ్ వన్' స్టూడియోను సీఎం దేవేంద్ర ఫడణవీస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణ' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ సందర్భంగా ఫడణవీస్ మాట్లాడుతూ.. 'రామాయణ' అనేది కేవలం ఒక దశాబ్దానికి సంబంధించిన సినిమా కాదని, ఇది ఒక 'సహస్రాబ్దపు సినిమా' (Film of the Millennium) అని అభివర్ణించారు. అంతేకాదు, అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నతంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి అకాడమీ అవార్డు (ఆస్కార్) రాకపోతే, అకాడమీ జ్యూరీ నిర్ణయం పట్ల తాను తీవ్రంగా నిరాశ చెందుతానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
గ్లోబల్ ఆడియెన్స్‌ను కట్టిపడేసేలా అత్యుత్తమ సాంకేతికతతో, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న తీరు అద్భుతమని ఆయన కొనియాడారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోరణ్ బీర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, కన్నడ స్టార్ యశ్ లంకాధిపతి రావణుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురుచూస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమా మొదటి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా ఈ సినిమా స్థాయిని కొనియాడుతూ ఆస్కార్ రేసులో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేయడంతో, 'రామాయణ'పై అంచనాలు మరింత తారాస్థాయికి చేరాయి.