Jabardasth' fame Komuram: మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తన నటనతో అందరినీ కంటతడి పెట్టించిన 'జబర్దస్త్' ఫేమ్ కొమురం.. సక్సెస్ మీట్‌లో భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సక్సెస్ మీట్‌లో కొమురం మాట్లాడుతూ.. "షాద్‌నగర్‌లో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి. టికెట్లు ఇప్పించమని నన్ను అడుగుతున్నారు. నేను చచ్చే వరకూ శివ నిర్వాణ సర్ను మర్చిపోతే, నేను మనిషినే కాదు" అంటూ కన్నీరు పెట్టుకున్నారు. తాను ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లు అయిందని, గత 12 ఏళ్లుగా 'కొమురక్క' అనే లేడీ గెటప్‌లోనే బతుకుతున్నానని చెప్పారు. ఆ గెటప్ లెజెండే అయినప్పటికీ, అది తాను కాదని కేవలం ఒక గెటప్ మాత్రమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తమతో కలిసి రూమ్‌లో ఉన్న ఎంతోమంది దర్శకులుగా మారినా, ఎవరూ తనలోని నటుడిని గుర్తించలేదని కొమురం వాపోయారు. శివ నిర్వాణ తనకు రక్తసంబంధం లేకపోయినా, తనకింత మంచి పాత్ర ఎందుకు ఇచ్చారో తెలియదన్నారు. షూటింగ్ మొదటి రోజు తన పాత్ర గే క్యారెక్టర్ అనుకున్నానని, కానీ రవితేజను కొట్టే ఫైట్ అని తెలిసి తనకు చెమటలు పట్టేశాయని నవ్వుతూ చెప్పారు. సినిమాలో ఆ సీన్ చూశాక ఏడు ప్రొడక్షన్ హౌస్‌ల నుంచి తనకు ఫోన్‌లు వచ్చాయని తెలిపారు.

ఇండస్ట్రీలో వంద మంది హీరోలు, వంద రకాల ఫ్యాన్స్ ఉంటే.. ఆ వంద రకాల ఫ్యాన్స్ ఇష్టపడే ఏకైక హీరో రవితేజ సర్ అని కొనియాడారు. కొమురక్కగా ఉన్న తనను 'నాగులు'గా మార్చి, తన జీవితానికి భవిష్యత్‌పై భరోసా కల్పించిన ఈ పాత్రను ఎప్పటికీ మర్చిపోలేనని కొమురం పేర్కొన్నారు. ఆయన మాటలకు దర్శకుడు శివ నిర్వాణ సైతం ఒకింత ఎమోషనల్ అయ్యారు.

Tags: