Keerthy Suresh: ప్రముఖ కథానాయిక కీర్తి సురేశ్‌కు విమాన ప్రయాణంలో ఊహించని చేదు అనుభవం ఎదురైంది. అభిమానం పేరుతో ఓ ప్రయాణికుడు హద్దులు దాటి ప్రవర్తించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సెల్ఫీ కోసం మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఇబ్బంది పెట్టగా, సాధారణంగా ఎంతో సౌమ్యంగా ఉండే ఆమె భర్త ఆంటోనీ తట్టిల్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీర్తి స్వయంగా ఈ ఉదంతాన్ని పంచుకుంది.

అసలేం జరిగింది?

ఇటలీలోని మిలాన్ నగరం నుంచి భారత్‌కు భర్త ఆంటోనీతో కలిసి ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో తూలుతున్న ఓ ప్రయాణికుడు కీర్తి వద్దకు వచ్చి సెల్ఫీ కావాలని అడిగాడు. అతను నిలబడే పరిస్థితిలో కూడా లేకపోవడంతో, కాసేపు ఆగి ప్రశాంతంగా దిగుదామని కీర్తి మర్యాదగానే చెప్పింది. అయినప్పటికీ ఆ వ్యక్తి వినకుండా, వెంటనే ఫొటో దిగాల్సిందేనంటూ మొండిపట్టు పట్టి ఆమె వ్యక్తిగత పరిధిలోకి చొచ్చుకువచ్చాడు.

రంగంలోకి భర్త.. చివరకు క్యాబిన్ సిబ్బంది ఎంట్రీ

ఆ వ్యక్తి అతి ప్రవర్తనతో కీర్తి తీవ్ర అసౌకర్యానికి గురైంది. తన అనుమతి లేకుండా బలవంతం చేసే హక్కు ఎవరికీ లేదని ఆమె స్పష్టం చేసింది. అయితే ఆ ప్రయాణికుడు మరింత మొండిగా వ్యవహరించడంతో, ఎప్పుడూ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండే ఆమె భర్త ఆంటోనీ తట్టిల్ కల్పించుకుని అతడిపై గట్టిగా మండిపడ్డారు. వివాదం సద్దుమణగకపోవడంతో చివరకు ఫ్లైట్ సిబ్బంది జోక్యం చేసుకుని ఆ వ్యక్తిని అక్కడి నుంచి పంపించి వేయాల్సి వచ్చింది.

అభిమానం మంచిదే.. కానీ హద్దులు దాటొద్దు: కీర్తి హితవు

ఈ ఘటనపై కీర్తి సురేశ్ స్పందిస్తూ సెలబ్రిటీల ప్రైవసీ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. అభిమానుల ఆదరాభిమానాలను ఎప్పుడూ గౌరవిస్తానని, చాలామంది ఎంతో మర్యాదగా వచ్చి మాట్లాడుతుంటారని పేర్కొంది. ఎంతోమంది కనీసం సెల్ఫీ కూడా అడగకుండా ప్రయాణం మొత్తం ఎంతో ఆప్యాయంగా ముచ్చటిస్తారని గుర్తుచేసుకుంది. అయితే అభిమానం ఉందనే నెపంతో ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను, ప్రశాంతతను హరించేలా ప్రవర్తించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆమె స్పష్టం చేసింది. సెలబ్రిటీలకు కూడా వ్యక్తిగత సరిహద్దులు ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికింది.

Tags: