Kiran Abbavaram: తోటి నటుడికి అవమానంపై ఘాటుగా స్పందించిన కిరణ్ అబ్బవరం

ఘాటుగా స్పందించిన కిరణ్ అబ్బవరం

Update: 2025-10-13 08:47 GMT

Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు ఘాటుగా బదులిచ్చి.. తోటి నటుడికి జరిగిన అవమానంపై తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన తాజా చిత్రం కె-ర్యాంప్. జైన్ నాని దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 18న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న కిరణ్‌ను ఓ మహిళా యాంకర్ "మీకు ఎలాంటి సినీ నేపథ్యం లేదు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం సాధ్యమేనా?" అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు కిరణ్ చాలా హుందాగా స్పందించారు. "నన్ను ఇలాంటి ప్రశ్నలు ఎన్ని అడిగినా ఫర్వాలేదు.. నేను సమాధానం చెబుతాను. కానీ ఎదుటివారిని కించపరిచేలా ప్రశ్నలు వేయడం మాత్రం సరైన పద్ధతి కాదు" అని అన్నారు. అనంతరం ఇటీవల జరిగిన ఒక వివాదాన్ని ప్రస్తావిస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు. "వేరే రాష్ట్రం నుంచి వచ్చిన ఒక హీరోని పట్టుకుని నీ ముఖం బాగాలేదు అని అనడం దారుణం. ఆ మాటలు విన్నప్పుడు నాకే చాలా బాధ కలిగింది" అని పేర్కొన్నారు.

తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్‌ను ఓ ఇంటర్వ్యూలో ఆయన రూపంపై యాంకర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటనను కిరణ్ అబ్బవరం ఈ సందర్భంగా ఉద్దేశించారు. తనను అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూనే, తోటి నటుడికి మద్దతుగా నిలిచిన కిరణ్ అబ్బవరంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సెలబ్రిటీలను ప్రశ్నించే విషయంలో హద్దులు దాటకూడదని హితవు పలకడంపై ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News