Korean Kanakaraju movie: కొరియన్ దెయ్యంతో కనకరాజు
దెయ్యంతో కనకరాజు
Korean Kanakaraju movie: వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. సోమవారం వరుణ్ తేజ్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రానికి ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ను ఫైనల్ చేస్తూ, స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. కనకరాజు కోసం కొరియన్ పోలీసులు కమెడియన్ సత్యను కొట్టి ఇంటరాగేషన్ చేస్తుంటారు. తాను అనంతపురంలోని పెనుకొండకు చెందిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అని చెబుతాడు. హీరోయిన్ రితికా నాయక్ కూడా అక్కడే ఉంటుంది. ఒక్కసారి వైబ్ మారిపోతుంది. పౌర్ణమి చంద్రుడు, గబ్బిలాలు గుంపులుగా రావడం, డ్రాగన్ మూతతో ఉన్న పింగాణి పాత్ర భయంకరమైన శబ్దాలు చేస్తుంది.
అప్పుడు హీరో తన చేతిలో మెరిసే కత్తితో అడుగుపెడతాడు. తరువాత ఊచకోత మొదలౌతుంది. టేబుల్ పై కూర్చున్న కనకరాజు ఓ చిరునవ్వు నవ్వి, నీలి రంగు కళ్లతో ఇంటెన్స్‌గా చూసి ‘నేను తిరిగి వచ్చాను’ అని కొరియన్ భాషలో చెప్పడం, స్క్రీన్‌పై ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ను రివీల్ చేయడం ఆసక్తిని పెంచింది. ఓ కొరియన్ మాఫియా డాన్ ఆత్మ కనకరాజును ఆవహిస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలే ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్ అని టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కిస్తున్నారు. వరుణ్ తేజ్ డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. సమ్మర్‌లో సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.