Meenakshi Chaudhary: టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు యువ కథానాయిక మీనాక్షి చౌదరి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన అనగనగా ఒక రాజు చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆమె, ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ చిత్రంలోనూ ఆమెకు అవకాశం దక్కినట్లు ఫిలింనగర్ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.

నితిన్ - రామ్ అబ్బరాజు ప్రాజెక్ట్

సామజవరగమన చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రామ్ అబ్బరాజు, తదుపరి ప్రాజెక్ట్‌ను నితిన్‌తో పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రేజీ చిత్రంలో కథానాయికగా మీనాక్షి చౌదరిని ఎంపిక చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతుండగా, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

చేతినిండా భారీ చిత్రాలు

నాగచైతన్య సరసన నటించిన వృషకర్మ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ కార్తి కథానాయకుడిగా రూపొందుతున్న భారీ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వరుస విజయాలు, చేతినిండా భారీ అవకాశాలతో కెరీర్‌లో దూకుడు ప్రదర్శిస్తున్న మీనాక్షి.. నితిన్ ప్రాజెక్ట్‌తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.

Tags: