Spirit: స్పిరిట్'లో మెగాస్టార్ చిరంజీవి?.. సందీప్ వంగా తీవ్ర ప్రయత్నాలు
సందీప్ వంగా తీవ్ర ప్రయత్నాలు;
Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - 'యానిమల్' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న 'స్పిరిట్' సినిమాపై ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో ఓ అత్యంత కీలకమైన పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవిని తీసుకురావాలని సందీప్ వంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ వార్త నిజమైతే, సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవలి బ్లాక్‌బస్టర్ సినిమా 'యానిమల్'లో అనిల్ కపూర్ పోషించిన పాత్ర సినిమాకు ఎంతటి బలాన్ని ఇచ్చిందో తెలిసిందే. అదే తరహాలో 'స్పిరిట్'లో కూడా ఓ పవర్‌ఫుల్ నటుడు ఉంటే సినిమా స్థాయి మరింత పెరుగుతుందని సందీప్ భావిస్తున్నారట. ఈ పాత్రకు మెగాస్టార్ చిరంజీవి అయితేనే పూర్తి న్యాయం చేయగలరని ఆయన నమ్ముతున్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి బిజీ షెడ్యూలే అడ్డంకి
ఈ ప్రచారానికి ఒక పెద్ద అడ్డంకి ఉంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర', 'మన శంకరవరప్రసాద్ గారు' వంటి భారీ ప్రాజెక్టులతో పాటు, బాబీ, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలన్నీ చిత్రీకరణ దశలో ఉండటంతో, ఆయన 'స్పిరిట్' కోసం సమయం కేటాయించడం సాధ్యమేనా అనేది చర్చనీయాంశంగా మారింది.
ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా..
మరోవైపు ప్రభాస్ తన ది రాజాసాబ్, ఫౌజీ చిత్రాల చిత్రీకరణను దాదాపు పూర్తి చేశారు. దీంతో స్పిరిట్ కోసం ఏకధాటిగా డేట్స్ ఇచ్చేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ ఒక శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతుండగా, విలన్ పాత్ర కోసం ప్రముఖ కొరియన్ స్టార్ డాన్ లీని తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. వీరితో పాటు తరుణ్, శ్రీకాంత్, మడోన్నా సెబాస్టియన్ కూడా కీలక పాత్రల్లో నటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.