Sunita Ahuja: నా భర్త గోవిందా మైండ్ దొబ్బినట్టుంది..భార్య సునీత సంచలన వ్యాఖ్యలు
భార్య సునీత సంచలన వ్యాఖ్యలు
Sunita Ahuja: బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా మరోసారి వివాదాల్లో నిలిచారు. ఈసారి ఆయన ఎయిర్‌పోర్ట్‌లో తనతో పాటు యువ నటి కోమల్ రాణి స్వర్ణకర్‌తో కలిసి కెమెరాలకు చిక్కడం బాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, ఈ వీడియోపై గోవిందా భార్య సునీత అహుజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట మంటలు పుట్టిస్తున్నాయి. అసలేం జరిగింది?
ఇటీవల గోవిందా , కోమల్ రాణి స్వర్ణకర్ ఎయిర్‌పోర్ట్‌లో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరిద్దరూ కలిసి 'రూప' అనే సినిమాలో నటిస్తున్నారు. అయితే, వీరిద్దరినీ కలిపి చూడగానే నెటిజన్లు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. గతంలో సునీత అహుజా తన భర్త గోవిందాకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, అందులో 'కోమల్' అనే పేరు కూడా ఉందని గతంలోనే బయటపెట్టారు. ఇప్పుడు సరిగ్గా అదే పేరున్న నటితో గోవిందా కెమెరాలకు చిక్కడం ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోసింది.
ఈ విషయంపై సునీత అహుజాను మీడియా ప్రశ్నించగా, ఆమె చాలా ఘాటుగా స్పందించారు. 'వినాశకాలే విపరీత బుద్ధి' అని పేర్కొన్న ఆమె, "ఆయన బుద్ధి భ్రష్టు పట్టింది, అందుకే ఇలా చేస్తున్నారు. దీని గురించి నేను ఇక మాట్లాడను. గోవిందా అభిమానులు, మీడియానే సమాధానం చెప్పాలి, నాకు ఇందులో ఎలాంటి ఆసక్తి లేదు" అని కుండబద్దలు కొట్టారు.
మరోవైపు, గోవిందా స్పందిస్తూ తన భార్య తనను ఎంతో ప్రేమిస్తుందని, ఆమె చేసే విమర్శల్లో కూడా ప్రేమ ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే, సునీత అహుజా గత కొన్ని నెలలుగా తన భర్త అఫైర్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ ఎయిర్‌పోర్ట్ వీడియో గోవిందా దంపతుల మధ్య ఉన్న దూరాన్ని మరింత పెంచుతుందా? లేదా ఇది కేవలం సినిమా ప్రమోషన్‌లో భాగమా? అనేది వేచి చూడాలి.