Vijay Deverakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులకు అదిరిపోయే తీపి కబురు అందింది. ఆయన కథానాయకుడిగా రూపొందుతోన్న భారీ పాన్-ఇండియా చిత్రం రణబాలి విడుదల తేదీపై గత కొద్ది రోజులుగా సాగుతున్న సస్పెన్స్‌కు చిత్రబృందం తెరదించింది. సినిమా వాయిదా పడుతోందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేస్తూ, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా స్పష్టం చేసింది.

దసరా కానుకగా బాక్సాఫీస్ వేట

విజయదశమి పండుగను పురస్కరించుకుని ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. టాక్సీవాలా వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ కలయికలో వస్తున్న రెండో చిత్రం కావడంతో మొదటి నుంచీ దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ సమర్పిస్తోంది.

వాస్తవ చారిత్రక కథాంశంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామా

ఈ చిత్రం 19వ శతాబ్దపు బ్రిటిష్ పాలన కాలం నాటి కథతో తెరకెక్కుతోంది. 1854 నుంచి 1878 మధ్య జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా రాహుల్ సాంకృత్యన్ ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తుండటంతో మరోసారి వీరి హిట్ కాంబినేషన్ చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వీరతిలకంతో రౌడీ స్టార్.. పోస్టర్ వైరల్!

విడుదల తేదీ స్పష్టతతో పాటు విడుదల చేసిన సరికొత్త పోస్టర్ నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది. నుదుటన వీరతిలకం దిద్దుకుని, తీవ్రమైన ఆవేశంతో కనిపిస్తున్న విజయ్ దేవరకొండ లుక్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇప్పటికే విడుదలైన ఏందయ్య సామీ.. పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచి శ్రోతలను ఊపేస్తుండగా, తాజా ప్రకటనతో దసరా బాక్సాఫీస్ బరిలో ‘రణబాలి’ ధమాకా ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Tags: