Vijay-Rashmika: టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల ప్రేమకథకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా రకరకాల రూమర్లు వినిపించినప్పటికీ.. వాటిపై వారు ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. చివరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అయితే, పెళ్లికి ముందు తమ రిలేషన్‌షిప్‌ను ఎందుకు అత్యంత గోప్యంగా ఉంచాల్సి వచ్చిందనే విషయాన్ని ఈ జంట తాజాగా బయటపెట్టింది. ‘రణబాలి’ చిత్ర ప్రమోషన్లలో భాగంగా శుభంకర్‌ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న విజయ్-రష్మిక.. తమ ప్రేమ ప్రయాణం, పెళ్లి ఆలోచనల వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

ఎవరి వినోదం కోసమో మా బంధం కాదు: రష్మిక

తమ రిలేషన్‌షిప్‌‌ను ప్రైవేట్‌గా ఉంచడంపై రష్మిక స్పందిస్తూ.. "మన జీవితంలో కొన్ని ప్రత్యేకమైన క్షణాలు, అనుభూతులు ఉంటాయి. వాటిని అందరితో కాకుండా మన దగ్గరే భద్రంగా ఉంచుకోవాలని అనుకుంటాం. మా రిలేషన్‌షిప్ అనేది ఇతరుల వినోదం కోసమో లేదా సోషల్ మీడియా గాసిప్పుల కోసమో కాదు. అందుకే ఆ బంధాన్ని పర్సనల్‌గానే ఉంచాం" అని స్పష్టం చేసింది.

చెప్పాల్సిన అవసరం అనిపించలేదు: విజయ్

ఇదే విషయంపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. "మేం మా బంధాన్ని దాచాలని ఏ రోజూ తీవ్రంగా ప్రయత్నించలేదు. అలాగని బయటి ప్రపంచానికి మా వ్యక్తిగత విషయాలన్నీ వివరించాల్సిన బాధ్యత ఉందని కూడా అనుకోలేదు. మొదట్లో ఇద్దరం కో-స్టార్స్‌గా పరిచయమయ్యాం. అది కాస్తా మంచి స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. సహజంగా సాగిన ఈ ప్రయాణాన్ని అందరి ముందు పబ్లిసిటీ చేసుకోవాలని అనుకోలేదు" అని పేర్కొన్నాడు.

సినిమాటిక్ ప్రపోజల్స్ లేవు..

చాలా లవ్ స్టోరీస్ మాదిరిగా తమ ప్రేమకథలో నాటకీయతలు, మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్ చేసుకోవడాలు వంటివి ఏమీ జరగలేదని విజయ్ వెల్లడించాడు. "మా ప్రేమకు ఫలానా రోజే మొదలైందని చెప్పడానికి ఏ డేట్ లేదు.. అలాగే ఎవరూ ముందుగా ప్రపోజ్ కూడా చేసుకోలేదు. కానీ రోజులు గడిచేకొద్దీ మా అనుబంధం బలపడుతూ వచ్చింది" అని విజయ్ వివరించాడు. రష్మిక కూడా దీనిపై మాట్లాడుతూ.. మూడు, నాలుగేళ్ల పరిచయం తర్వాత తామిద్దరం కలిసుంటేనే జీవితం సంపూర్ణంగా ఉంటుందనే నమ్మకం కలిగిందని తెలిపింది.

ఆ ఆలోచనే పెళ్లి వైపు నడిపించింది

పెళ్లి నిర్ణయం ఎలా తీసుకున్నారనే ప్రశ్నకు విజయ్ ఎమోషనల్ సమాధానమిచ్చాడు. "పెళ్లికి దాదాపు ఏడాది ముందు నా జీవితంలో రష్మిక ఎంత ముఖ్యమో నాకు స్పష్టంగా అర్థమైంది. కలిసి వర్క్ చేయడం, ట్రైనింగ్, భోజనం చేయడం.. ఇలా ప్రతిదీ ఆమెతో ఉన్నప్పుడే మరింత ఆనందంగా అనిపించేది. చివరికి నేను ఒంటరిగా భోజనం చేస్తున్నప్పుడు కూడా ఈ సమయంలో రష్మిక పక్కన ఉంటే ఎంత బాగుంటుంది అనే భావన వచ్చేది. నా జీవితంలోని ప్రతి చిన్న ఆనందాన్ని ఆమెతోనే పంచుకోవాలని బలంగా అనిపించింది. ఆ అనుభూతే నన్ను పెళ్లి దిశగా అడుగులు వేయించింది" అని విజయ్ చెప్పుకొచ్చాడు.

Tags: