Ranbir Kapoor’s ‘Ramayana’ : రణ్‌బీర్ రామాయ రన్‌టైమ్ లాక్.. సెన్సార్ పూర్తి.. నిడివి ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
షాక్ అవ్వాల్సిందే..
Ranbir Kapoor’s ‘Ramayana’ : భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పౌరాణిక దృశ్యకావ్యం రామాయణ. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ విజువల్ వండర్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ ఆన్‌లైన్ టికెటింగ్ వేదిక బుక్‌మైషో అందించిన వివరాల ప్రకారం.. ఈ సినిమా సెన్సార్ ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది.
సెన్సార్ నుంచి క్లీన్ U.. ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు!..
బుక్‌మైషో పోర్టల్‌లో నమోదైన తాజా వివరాల ప్రకారం, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యు సర్టిఫికెట్‌ను కేటాయించింది. ఎటువంటి కట్స్ లేకుండా, కుటుంబ సమేతంగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కలిసి థియేటర్లలో చూడదగ్గ క్లీన్ చిత్రంగా ఇది నిలవనుంది. అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ వివరాలు ఇంకా అప్‌లోడ్ కావాల్సి ఉంది. అయినప్పటికీ, బుక్‌మైషోలో కనిపించిన సమాచారమే దాదాపు ఖరారైనట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.
3 గంటలకు పైగా విజువల్ వండర్!
ఈ సినిమా నిడివి ఏకంగా 3 గంటల 15 నిమిషాలు ఉన్నట్లు సమాచారం. రామాయణం లాంటి యుగయుగాల ఇతిహాసాన్ని సమగ్రంగా, భావోద్వేగాల లోతు తగ్గకుండా వెండితెరపై చూపించాలంటే ఇంతటి భారీ రన్‌టైమ్ తప్పనిసరి అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతసేపు ప్రేక్షకులను కట్టిపడేసేలా నితీశ్ తివారీ కథనాన్ని నడిపించిన తీరు ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.
గ్లోబల్ లెవెల్ తారాగణం.. విడుదల ఎప్పుడంటే?
ఈ దృశ్యకావ్యంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణాసురుడిగా కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన దిగ్గజ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్, ఆస్కార్ విజేత హన్స్ జిమ్మెర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా ఈ విజువల్ స్పెక్టాకిల్ నవంబర్ 5న అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలోకి రానుంది. ఈ తాజా రన్‌టైమ్, సెన్సార్ సమాచారంతో సినిమాపై అంచనాలు మరింత తారస్థాయికి చేరాయి.