Dhurandhar: బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ధురంధర్ అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ ప్రఖ్యాత ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో 2026 మొదటి అర్ధభాగంలో అత్యధికంగా వీక్షించబడిన నాన్-ఇంగ్లీష్ చిత్రంగా ధురంధర్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ కో-సీఈవో టెడ్ సరాండోస్ అధికారికంగా వెల్లడించారు.

నెట్‌ఫ్లిక్స్ చార్ట్ ఆక్యుపై చేసిన ధురంధర్

ఎక్స్‌ప్రెస్ అడ్డా కార్యక్రమంలో టెడ్ సరాండోస్ మాట్లాడుతూ, ఈ ఏడాది హాలీవుడ్ చిత్రాల తర్వాత అంతర్జాతీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రాజెక్ట్‌గా ధురంధర్ నిలిచిందని కొనియాడారు.

37 మిలియన్ వ్యూస్: 2026 జనవరి నుండి జూన్ మధ్య కాలంలో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం ఏకంగా 3.7 కోట్ల వీక్షణలను సొంతం చేసుకుంది. ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా 22 దేశాలలో నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్స్‌లో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది.

బాక్సాఫీస్ వద్ద రూ. 3,100 కోట్లకు పైగా వసూళ్లు

భారీ యాక్షన్ సినిమాల దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ ఫ్రాంచైజీ, థియేటర్లలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.

పార్ట్-1: 2025 డిసెంబర్‌లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించింది.

పార్ట్-2 2026 మార్చిలో వచ్చిన సీక్వెల్, భారతదేశంలోనే రూ. 1,000 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన తొలి బాలీవుడ్ చిత్రంగా సరికొత్త చరిత్ర పుటలకెక్కింది. రెండు భాగాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 3,100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి భారతీయ సినిమా సత్తాను చాటాయి.

ఇండియన్ కంటెంట్‌పై నెట్‌ఫ్లిక్స్ ప్రశంసలు

గ్లోబల్ స్థాయిలో భారతీయ సినిమాలకు వస్తున్న ఆదరణపై టెడ్ సరాండోస్ హర్షం వ్యక్తం చేశారు. 2024 నుండి ప్రతీ వారం ఏదో ఒక భారతీయ చిత్రం లేదా వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్-10 ట్రెండింగ్‌లో ఉంటోందని చెప్పారు. స్క్విడ్ గేమ్, మనీ హీస్ట్ లాంటి గ్లోబల్ ట్రెండ్ సెట్టర్స్ భారత్ నుంచి ఎప్పుడు వస్తాయని చాలామంది అడుగుతుంటారని, కానీ భారతీయ చిత్రాలు ఇప్పటికే ఆ స్థాయి విజయాలను సొంతం చేసుకుంటున్నాయని ఆయన ప్రశంసించారు.

Tags: