Chiranjeevi: ఆంధ్రప్రదేశ్‌ అధికారిక బ్రాండ్‌ అంబాసిడర్‌గా నటుడు చిరంజీవి వ్యవహరించబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన టీమ్ అధికారికంగా స్పష్టం చేసింది. ఇలాంటి అవాస్తవ ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని కోరింది. చిరు ప్రజాదరణతో ఏపీ పర్యాటకం, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆయనను అంబాసిడర్‌గా కోరిందంటూ గత రెండు రోజులుగా పుకార్లు షికారు చేశాయి. ఈ వార్తలను ఖండిస్తూ చిరంజీవి టీమ్ ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసి, ముగింపు పలికింది.

సినిమాలపైనే పూర్తి దృష్టి

రాజకీయాలు లేదా ఇతర బాధ్యతల కంటే ప్రస్తుతం తన దృష్టంతా సినిమాలపైనే ఉన్నట్లు మెగాస్టార్ స్పష్టం చేశారు. రీఎంట్రీ తర్వాత వరుస ప్రాజెక్ట్‌లతో యువ హీరోలకు పోటీగా సినిమాలు పూర్తి చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 158 షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమా టైటిల్ టీజర్‌ను చిరంజీవి పుట్టినరోజు కానుకగా విడుదల చేయనున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభరను దసరా కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా పుట్టినరోజు నాడే ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రాల అనంతరం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, నాని నిర్మాణంలో చిరు మరో ప్రాజెక్ట్ చేయనున్నారు.

Tags: