Sai Pallavi: సాయిపల్లవి ఇప్పటివరకు క్యారెక్టర్‌ డ్రివెన్ సినిమాల్లోనే కనిపించేది. కానీ ఈసారి ఆమె పూర్తి యాక్షన్ మోడ్‌లోకి వచ్చింది. ధనుష్ హీరోగా, మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన ‘ఓం’ సినిమా ట్రైలర్‌లో సాయిపల్లవి ఐపీఎస్ అధికారిణిగా అద్భుతమైన ఫైట్‌లు చేస్తూ కనిపించింది. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తొలిసారి ఆమెతో ఇంత తీవ్రమైన యాక్షన్ సీక్వెన్స్‌లు చేయించిన ఘనత సొంతం చేసుకున్నారు.

సాధారణంగా హీరోలే ఫైట్‌లు చేస్తుంటే, ఇటీవల కాలంలో హీరోయిన్లను కూడా యాక్షన్‌లో పెట్టడం మొదలైంది. ‘ఓం’లో సాయిపల్లవి ఆ ట్రెండ్‌ను మరింత పైస్థాయికి తీసుకెళ్లింది. ట్రైలర్‌లో ఆమె పోలీస్ యూనిఫామ్‌లో, తీవ్రమైన ఎక్స్‌ప్రెషన్‌తో యాక్షన్ చేస్తున్న సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్, కూలీలపై పోలీసుల కాల్పులు వంటి నిజజీవిత సంఘటనల నేపథ్యంలో తెరకెక్కింది. ధనుష్ తమిళనాడు నుంచి అండర్‌కవర్ పోలీసుగా స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లోకి చొరబడతాడు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి సాయిపల్లవి ఐపీఎస్ అధికారిణిగా ఆపరేషన్ మోల్‌ను నడుపుతుంది. ఇద్దరూ ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నా, వారి మార్గాలు ఎలా కలుస్తాయనేది కథలోని ఉత్కంఠ.

ధనుష్ భార్యగా శ్రీలీల నటించగా, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గ్రే షేడెడ్ పాత్రలో కనిపిస్తున్నారు. ట్రైలర్‌లో మమ్ముట్టి స్క్రీన్ ప్రెజెన్స్ భారీగా ఉంది. సంగీతం సాయి అభ్యంకర్ అందించగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్స్‌కు మరింత శక్తిని జోడించింది.

ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా, ఉత్కంఠభరితంగా ఉంది. కొన్ని సీన్స్‌లో ధనుష్ పోలీసులకు వ్యతిరేకంగా కనిపించడం, స్మగ్లర్లతో కలిసి ఉండటం వంటి అంశాలు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఆపరేషన్ మోల్ అనే పేరుతో సాగే ఈ చిత్రం రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దులు దాటి సాగే నేరాల నెట్‌వర్క్‌ను చూపిస్తుంది.

‘ఓం’ సినిమా నవంబర్ 20న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. ధనుష్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు పెంచుతోంది. సాయిపల్లవి యాక్షన్ ఏవతార్, ధనుష్ ఇంటెన్సిటీ, మమ్ముట్టి ప్రెజెన్స్ కలయికతో ఈ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Tags: