Samantha Opens Up: సినీ నటిగా, నిర్మాతగా, సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సమంత, తాజాగా ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒకానొక సమయంలో నటనకు శాశ్వతంగా దూరమైపోవాలని అనుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. అనారోగ్య సమస్యలతో ఏడాది పాటు విరామం తీసుకున్న సమయంలో, శరీరానికి శ్రమ తగ్గించాలని, యాక్టింగ్‌ను పక్కన పెట్టి ప్రత్యామ్నాయ వృత్తిని చూసుకోవాలని డాక్టర్లు గట్టిగా సూచించారు. ఆ హెచ్చరికతో భయపడిన సమంత, నటనకు స్వస్తి పలికి ఇతర రంగాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. భవిష్యత్ భరోసా కోసం తనకు నమ్మకమున్న రంగాల్లో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఓ ఎంట్రప్రెన్యూర్‌గా తన ప్రయాణాన్ని ఎంతగానో ఆస్వాదిస్తున్నట్లు తెలిపారు.

ఆరోగ్యం సహకరించకపోయినా ప్రాజెక్టుల పూర్తి

ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్న సమయంలో 'సిటాడెల్' సెట్‌లో పనిచేయడం తీవ్ర ఇబ్బందిగా మారింది. తన వల్ల యూనిట్ సమయం వృథా కాకూడదని తప్పుకోవాలని భావించి ఈమెయిల్స్ పెట్టినా, నిర్మాణ బృందం పట్టుబట్టడంతో ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సి వచ్చింది. ఈ చిత్రానికి మొదట కేవలం నిర్మాతగానే తెరవెనుక ఉండాలని భావించినా, దర్శకుడు రాజ్ పదే పదే ప్రోత్సహించి బలవంతం చేయడంతోనే ప్రధాన పాత్రలో నటించాల్సి వచ్చిందని వెల్లడించారు.

ట్రోల్స్‌ను అధిగమించిన తీరు

గతంలో ట్రోలింగ్ ఎదురైనప్పుడు తీవ్ర మానసిక క్షోభను అనుభవించినట్లు సమంత గుర్తు చేసుకున్నారు. అయితే కాలక్రమేణా ఆ విమర్శలను పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. "ఎవరైనా మన గురించి నెగెటివ్‌గా మాట్లాడాలని నిర్ణయించుకుంటే వారి ఆలోచనను మనం మార్చలేం. అలాంటి వారిని ఒప్పించే ప్రయత్నంలో సమయాన్ని వృథా చేయకూడదు" అని పేర్కొన్నారు. జీవితంలో స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నప్పుడు ఇతరుల అనవసర మాటలను విస్మరించడమే సరైన మార్గమని స్పష్టం చేశారు.

Tags: