Sensational Decision by Arijit Singh: అర్జిత్ సింగ్ సంచలన నిర్ణయం.. సినీ సంగీత ప్రస్థానానికి స్వస్తి..
సినీ సంగీత ప్రస్థానానికి స్వస్తి..
Sensational Decision by Arijit Singh: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక శకాన్ని సృష్టించుకున్న అర్జిత్ సింగ్, ఇకపై సినిమాలకు పాటలు పాడబోనని ప్రకటించారు. మంగళవారం రాత్రి సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన ఈ ప్రకటన సంగీత ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే తానూ సంగీతాన్ని పూర్తిగా వదలడం లేదని, స్వతంత్ర కళాకారుడిగా తన ప్రయాణం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఎందుకు ఈ నిర్ణయం?
అర్జిత్ సింగ్ తన నిర్ణయం వెనుక గల కారణాలను వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "చాలా కాలంగా దీని గురించి ఆలోచిస్తున్నాను. సినిమా పాటలతో కొంత విసుగు చెందాను. నాలో ఎదుగుదల కోసం కొత్త రకం సంగీతాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉంది" అని ఆయన తెలిపారు.
శాస్త్రీయ సంగీతం
భారతీయ శాస్త్రీయ సంగీతంపై మరింత దృష్టి సారించాలని, కొత్త గాయకులను ప్రోత్సహించాలని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అంగీకరించిన సినిమాలు కొన్ని ఉన్నాయని, వాటిని పూర్తి చేస్తానని అర్జిత్ వెల్లడించారు. కాబట్టి ఈ ఏడాది ఆయన నుండి మరికొన్ని పాటలు వచ్చే అవకాశం ఉంది.
అర్జిత్ సింగ్ సినీ ప్రస్థానం
2011లో మర్డర్ 2తో కెరీర్ మొదలుపెట్టిన ఆయన, 2013లో వచ్చిన ఆషికి 2లోని తుమ్ హి హో పాటతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. తెలుగులో మనం లోని కనులను తాకే ఓ కల, స్వామి రారాలోని అదేంటి ఒక్కసారి వంటి మెలోడీలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. సంగీత రంగానికి ఆయన చేసిన విశేష కృషికి గానూ 2025లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది.