Trending News

Smriti Irani Counters Deepika: దీపికాకు స్మృతి ఇరానీ కౌంటర్.. నిర్మాతకు లాభాలే కర్తవ్యమని వ్యాఖ్య..

నిర్మాతకు లాభాలే కర్తవ్యమని వ్యాఖ్య..

Update: 2025-10-15 18:13 GMT

Smriti Irani Counters Deepika: సినీ ఇండస్ట్రీలో ఎక్కువ పని గంటల చుట్టూ జరుగుతున్న చర్చపై కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నటి స్మృతి ఇరానీ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. ఒక నటిగా తన మొదటి బాధ్యత నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టడమేనని, పని గంటల గురించి తాను ఎప్పుడూ పట్టించుకోలేదని ఆమె స్పష్టం చేశారు.

ఇటీవల నటి దీపికా పదుకొణె ఎక్కువ పని గంటల కారణంగా కొన్ని పెద్ద సినిమాల నుంచి తప్పుకున్నారన్న వార్తల నేపథ్యంలో స్మృతి ఇరానీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

దీపికా వ్యక్తిగత విషయం, కానీ..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్మృతి ఇరానీ మాట్లాడుతూ, "దీపికా నిర్ణయం పూర్తిగా ఆమె వ్యక్తిగత విషయం. కానీ నా వరకు నేను ఎప్పుడూ నిర్మాత బాగు కోసమే పూర్తి అంకితభావంతో పని చేస్తాను. కొందరు ఈ పని గంటల అంశాన్ని అనవసరంగా పెద్ద వివాదం చేస్తున్నారు" అని అన్నారు.

పిల్లల్ని కని కూడా పని చేశా

తన పాత అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. తాను 'క్యోంకీ సాస్‌ భీ కభీ బహు థీ' సీరియల్ షూటింగ్ సమయంలోనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చానని చెప్పారు. "ఆ పరిస్థితుల్లో కూడా నిర్మాత నష్టపోకూడదనే ఉద్దేశంతో కష్టపడి పనిచేశాను" అని వివరించారు.

వందలాది జీవితాలు ఆధారపడి ఉంటాయి

నటులు తీసుకునే నిర్ణయం కేవలం వ్యక్తిగతం కాదని, దానిపై వందలాది మంది కార్మికుల జీవితాలు ఆధారపడి ఉంటాయని స్మృతి ఇరానీ అభిప్రాయపడ్డారు. "నేను షూటింగ్‌కు రాకపోతే, నాతో పాటు పనిచేసే 120 మందికి ఆ రోజు జీతం అందదు. వారి కుటుంబాలు ఇబ్బంది పడతాయి. అందుకే నటిగా, రాజకీయ నాయకురాలిగా, తల్లిగా నా బాధ్యతలను నేను ఎప్పుడూ సమన్వయం చేసుకుంటాను. ఇది నా బాధ్యత," అని ఆమె తెలిపారు.

దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత స్మృతి ఇరానీ మళ్లీ బుల్లితెరపై కనిపించడం, ఈ సమయంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి.

Tags:    

Similar News