Spirit Movie: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైస్.. స్పిరిట్ వచ్చేది ఆ రోజే..
స్పిరిట్ వచ్చేది ఆ రోజే..
Spirit Movie: రెబల్ స్టార్ ప్రభాస్, క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలయికలో రాబోతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా స్పిరిట్ విడుదలపై ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చింది. గత కొంతకాలంగా ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానుల కోసం మేకర్స్ అధికారికంగా తేదీని ఖరారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా వెల్లడైన ఈ ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు.
సినిమా విశేషాలు
ఈ సినిమాలో ప్రభాస్ మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో గర్జించనున్నారు. యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రి కథానాయికగా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కేవలం తెలుగు, హిందీ మాత్రమే కాకుండా ఏకంగా తొమ్మిది భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సెన్సేషనల్ హిట్స్ తర్వాత సందీప్ వంగా నుంచి వస్తున్న సినిమా కావడం, దానికి ప్రభాస్ స్టార్‌డమ్ తోడవడంతో స్పిరిట్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.