Sreeleela's Bollywood Debut: శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ: సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ముంబై!
మళ్లీ ముంబై!
Sreeleela's Bollywood Debut: తెలుగులో భామల వరుస సినిమాలతో అలరించిన యంగ్ నటి శ్రీలీల ఆదివారం హైదరాబాద్‌లోని ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సందడి చేస్తూ కనిపించారు. ఈమధ్య కాలంలో ఆమె సినిమా షూటింగ్‌ల కంటే కూడా ఇలాంటి ప్రారంభోత్సవాలు, వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగులో ఒక్క కొత్త సినిమా కూడా సెట్స్‌పై లేకపోవడమే. కాకపోతే ధనుష్ సరసన నటిస్తున్న ‘OM’ చిత్రం మాత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.
మరోవైపు ఆమె ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న హిందీ అరంగేట్రం (బాలీవుడ్ డెబ్యూ) బాగా ఆలస్యమవుతూ వచ్చింది. దాదాపు మూడేళ్ల క్రితమే ఆమె హిందీ సినిమాకి సంతకం చేయగా, గతేడాది కార్తీక్ ఆర్యన్ సరసన కీలక సన్నివేశాల చిత్రీకరణను కూడా పూర్తి చేసుకున్నారు. అయితే ఈ సినిమా కథ సూపర్‌హిట్ చిత్రం “సయ్యారా” (Saiyaara) కథను పోలి ఉందనే ప్రచారంతో, కథలో మార్పులు చేర్పులు చేయడంతో పాటు కొన్ని సన్నివేశాలను మళ్లీ రీషూట్ చేయాలని నిర్మాతలు భావించారు. దాంతో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కొన్ని నెలల పాటు ఆగిపోయింది.
తాజా సమాచారం ప్రకారం, ఈ విరామానికి తెరదించుతూ శ్రీలీల వచ్చే వారం నుంచి మళ్లీ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు. సినిమా మొత్తం పూర్తయ్యేంత వరకు ఆమె నిర్విరామంగా డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో 'OM' తప్ప మరే ఇతర ప్రాజెక్టులు లేకపోవడంతో, ఆమె మరో రెండు హిందీ సినిమాలకు కూడా ఓకే చెప్పి, తన దృష్టినంతటినీ బాలీవుడ్‌పైనే కేంద్రీకరిస్తున్నారు.