TG Vishwa Prasad: ది రాజా సాబ్ ఫ్లాప్నకు కారణమిదే.. ఓపెన్గా ఒప్పేసుకున్న నిర్మాత టీజీ విశ్వప్రసాద్..
నిర్మాత టీజీ విశ్వప్రసాద్..
TG Vishwa Prasad: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి కాంబినేషన్లో భారీ అంచనాల నడుమ వచ్చిన హారర్-కామెడీ చిత్రం ది రాజా సాబ్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 208 కోట్లకే పరిమితమైంది. అయితే, ప్రభాస్ క్రేజ్ ఉన్నప్పటికీ ఈ మూవీ ఎందుకు బోల్తా కొట్టిందనే విషయంపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్వయంగా స్పందించి, తాము చేసిన పొరపాట్లను నిర్మొహమాటంగా అంగీకరించారు.
సంక్రాంతి బరిలోకి దిగడమే మొదటి తప్పు..
హైదరాబాద్లో జరిగిన గరివిడి లక్ష్మి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న విశ్వప్రసాద్.. ది రాజా సాబ్ ఫలితంపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పష్టతనిచ్చారు. సంక్రాంతి వంటి తీవ్ర పోటీ ఉండే పండగ సీజన్లో చిత్రాన్ని విడుదల చేయడమే తాము చేసిన ప్రాథమిక పొరపాటని ఆయన తెలిపారు. ఒకవేళ సోలోగా లేదా మరో సాధారణ సమయంలో వచ్చి ఉంటే ఫలితం కచ్చితంగా వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డారు.
టికెట్ రేట్లు, ప్రీమియర్ల ఆలస్యం..
కేవలం విడుదల సమయమే కాకుండా మరికొన్ని అంశాలు కూడా సినిమాపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయని ఆయన వివరించారు. "మా సంస్థ చరిత్రలోనే మొదటిసారిగా ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచాలని ప్రయత్నించాం. నిజానికి ఆ నిర్ణయం తీసుకుని ఉండాల్సింది కాదు. అది ప్రేక్షకులకు తీవ్ర అసంతృప్తిని, నిరాశను మిగిల్చింది" అని విశ్వప్రసాద్ వెల్లడించారు. సినిమా విడుదల రోజున ప్రీమియర్ షోలు అనుకున్న సమయానికి పడకుండా ఆలస్యం కావడం కూడా ఓపెనింగ్స్పై ప్రభావం చూపింది.
ఫలితంతో నిరాశ చెందలేదు..
భారీ బడ్జెట్ సినిమా కావడంతో కలెక్షన్లు తక్కువగా వచ్చినప్పటికీ, ఈ ఫలితం తనను నిరాశకు గురిచేయలేదని విశ్వప్రసాద్ స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమలో గెలుపోటములు సహజమని, తాము ఈ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ప్రస్తుతం సానుకూల దృక్పథంతో సంతోషంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.